ఒరాకిల్ ఉద్యోగం పోయినా వెనుకడుగు లేదు.. 45 రోజుల్లోనే 3 ఆఫర్లు కొట్టేసిన టెక్కీ!
ఒరాకిల్‌లో ఉద్యోగం కోల్పోయిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కేవలం 45 రోజుల్లోనే మూడు ఉద్యోగ ఆఫర్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం AI ఇంజనీర్‌గా కొత్త ఉద్యోగంలో చేరబోతున్నట్లు ఆయన వెల్లడించాడు. ఉద్యోగం పోయిన తర్వాత తాను అనుసరించిన వ్యూహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
మార్చి 31న ఒరాకిల్‌లో జరిగిన ఉద్యోగాల కోతల్లో తాను కూడా ప్రభావితుడినయ్యానని టెక్కీ తెలిపాడు. అయితే నిరాశ చెందకుండా వెంటనే కొత్త లక్ష్యంతో ముందుకెళ్లానని చెప్పాడు. ప్రతిరోజూ 3 నుంచి 4 గంటల పాటు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ (DSA) ప్రాక్టీస్ చేశానని, ఇంటర్వ్యూలకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టానని వివరించాడు.
అదే సమయంలో AI ఇంజినీరింగ్‌ను మొదటి నుంచి నేర్చుకోవడం ప్రారంభించాడు. ట్రాన్స్‌ఫార్మర్స్, అటెన్షన్ మెకానిజమ్స్ వంటి అంశాలను అధ్యయనం చేసి, నెల రోజుల్లో రెండు AI ప్రాజెక్టులను పూర్తి చేశాడు. AI సహాయక సాధనాలను ఉపయోగించి 30 రోజుల లెర్నింగ్ ప్లాన్ రూపొందించుకుని క్రమశిక్షణతో అమలు చేశానని తెలిపాడు.
ఉద్యోగాల కోసం ప్రతిరోజూ 10 నుంచి 15 దరఖాస్తులు పంపినట్లు పేర్కొన్నాడు. కంపెనీల కెరీర్ పేజీలు, లింక్డ్‌ఇన్, నౌక్రీ, ఇండీడ్, వెల్‌ఫౌండ్ వంటి వేదికలను వినియోగించానని చెప్పాడు. నౌక్రీ ప్రొఫైల్‌ను రోజూ అప్‌డేట్ చేయడం, ‘ఇమ్మీడియట్ జాయినర్’గా నమోదు చేసుకోవడం కూడా ఉపయోగపడిందని వివరించాడు.
ఇంటర్వ్యూ సిద్ధతలో భాగంగా సిస్టమ్ డిజైన్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. రోజుకు రెండు గంటల పాటు సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్‌ను అధ్యయనం చేసి, పలు సాంకేతిక వ్యాసాలను చదివినట్లు తెలిపాడు. ఈ క్రమంలో సుమారు 20 మంది రిక్రూటర్లు తనను సంప్రదించగా, ఏడు కంపెనీల ఇంటర్వ్యూల్లో పాల్గొన్నానని వెల్లడించాడు. వాటిలో మూడు ఉద్యోగ ఆఫర్లు పొందిన తర్వాత AI ఇంజనీర్‌గా ఒక సంస్థలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇతరులకు స్ఫూర్తిదాయకమని వ్యాఖ్యానిస్తున్నారు.
