గుడ్‌బై పేపర్ కరెన్సీ..? భారత్‌లో ప్లాస్టిక్ నోట్లు తీసుకురావాలని ఆర్‌బీఐ ఆలోచన
భారత్‌లో త్వరలో పేపర్ కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దేశంలో పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై పరిశీలిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రారంభ దశలోనే ఉందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
పాలిమర్ నోట్లు ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ఇవి సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. తేమ, దుమ్ము, చిరిగిపోవడం వంటి సమస్యలకు తక్కువగా గురవుతాయి. దీంతో నోట్లు తరచుగా ముద్రించాల్సిన అవసరం తగ్గి దీర్ఘకాలంలో ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే నకిలీ కరెన్సీని అరికట్టేందుకు పారదర్శక విండోలు, హోలోగ్రామ్‌లు, ప్రత్యేక భద్రతా లక్షణాలు అమర్చవచ్చు.
దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ నగదు వినియోగం ఇంకా అధికంగానే కొనసాగుతోంది. దీంతో కరెన్సీ ముద్రణ వ్యయం గణనీయంగా పెరిగింది. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణకు రూ.6,372 కోట్లకు పైగా ఖర్చు అయింది. అదే సమయంలో భారీ సంఖ్యలో చిరిగిపోయిన, మురికిగా మారిన నోట్లను ఉపసంహరించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాలిమర్ నోట్లు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయని ఆర్‌బీఐ భావిస్తోంది.
భారత్‌లో పాలిమర్ నోట్ల ఆలోచన కొత్తది కాదు. 2012లో రూ.10 విలువైన పాలిమర్ నోట్లను కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అయితే సాంకేతిక, నిర్వహణ పరమైన కారణాలతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. ఇప్పుడు దాదాపు దశాబ్దం తర్వాత ఆ ప్రతిపాదనను మళ్లీ పరిశీలిస్తున్నారు. త్వరలో పైలట్ ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రారంభంగా రూ.10, రూ.20 వంటి చిన్న నోట్లతో ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, సింగపూర్, మలేషియా తదితర 60కిపైగా దేశాలు పాలిమర్ కరెన్సీని పూర్తిగా లేదా పాక్షికంగా ఉపయోగిస్తున్నాయి. భారత్‌లో కూడా ఈ ప్రతిపాదన అమలైతే, దేశ కరెన్సీ వ్యవస్థలో ఇది ఒక కీలక మార్పుగా నిలిచే అవకాశం ఉంది.
