ఇసుక ఆదాయాన్ని పెంచాలి.. అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన నిఘా ఉండాలి: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
టీజీఎండీసీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
హైదరాబాద్, జూన్ 6: రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.
శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాల నిర్వహణ, ఇసుక లభ్యత, ఆదాయ పరిస్థితి, ఆదాయ వృద్ధికి ఉన్న అవకాశాలు, నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు.
అన్ని కార్యకలాపాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి, ఇసుక రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగాలని అధికారులను ఆదేశించారు. లారీల కదలికలను నిరంతరం పర్యవేక్షించే బలమైన నిఘా వ్యవస్థ ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
టీజీఎండీసీ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి శాఖ చేపడుతున్న ఆదాయ వృద్ధి చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థ బలోపేతం, అక్రమ మైనింగ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రికి వివరించారు. కొన్ని ప్రాంతాల్లో శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కీలక ఖనిజాలు, ఇతర ఖనిజాల అన్వేషణకు సంబంధించి కొనసాగుతున్న కార్యక్రమాలపై అధికారులు మంత్రికి నివేదిక సమర్పించారు. అన్వేషణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు ప్రాధాన్యత గల అంశాలపై సమగ్ర నివేదికలను అందజేయాలని మంత్రి ఆదేశించారు.
అలాగే సాండ్ బజార్ల పనితీరు, శాఖ నిఘా వ్యవస్థ, సిబ్బంది అవసరాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఖనిజ వనరుల సమర్థ నిర్వహణ కోసం అమలు వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంతో పాటు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.
