కేంద్ర కార్మిక కోడ్ల అమలుకు తెలంగాణ కట్టుబడి ఉంది: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
కేంద్ర కార్మిక మంత్రుల వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి • లేబర్ కోడ్స్-2020 అమలును వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచన
హైదరాబాద్, జూన్ 8: రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్ నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్మిక మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబడింది.
సమావేశంలో నాలుగు కేంద్ర కార్మిక కోడ్ల అమలు స్థితిగతులు, అమలులో ఎదురవుతున్న సవాళ్లు, దేశవ్యాప్తంగా కార్మిక సంస్కరణల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అలాగే కార్మిక సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా కార్మిక చట్టాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, లేబర్ కోడ్స్-2020 అమలుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కొత్త కార్మిక కోడ్ల నిబంధనలను రాష్ట్ర వ్యవస్థలో సమన్వయం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, అవసరమైన చర్యలు పూర్తయిన వెంటనే రాష్ట్రంలో వాటిని అమలు చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో కార్మిక సంక్షేమ కార్యక్రమాలు, ఉపాధి కల్పన చర్యలు, కార్మిక చట్టాల సమర్థ అమలుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మంత్రి సమావేశంలో వివరించారు.
సమావేశానికి కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖ (LETF) కార్యదర్శి శ్రీమతి దాసరి హరిచందన, ఐఏఎస్,తో పాటు కార్మిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరుస్తూనే కార్మిక చట్టాలను సరళీకృతం చేయడం లక్ష్యంగా రూపొందించిన లేబర్ కోడ్స్-2020 అమలును అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
లేబర్ కోడ్స్ అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మోడల్ రూల్స్ రూపొందించిందని, అనేక రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసి వాటిని పునఃప్రచురించాయని ఆయన తెలిపారు. కార్మిక రంగం ఉమ్మడి జాబితాలో (Concurrent List) ఉన్నందున కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
లేబర్ కోడ్స్-2020 ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ కార్మిక చట్టాలను ఏకీకృతం చేసి సరళమైన విధానంలో తీసుకువచ్చామని, దీని ద్వారా కార్మికులకు మరింత రక్షణ, సంక్షేమ ప్రయోజనాలు లభించడంతో పాటు పరిశ్రమలకు కూడా చట్టాల అమలులో సౌలభ్యం కలుగుతుందని వివరించారు.
రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కార్మికుల సంక్షేమం, దేశ ఆర్థికాభివృద్ధి దృష్ట్యా అనేక రాష్ట్రాలు లేబర్ కోడ్స్ అమలుకు ముందుకు రావడం సానుకూల పరిణామమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కొత్త కార్మిక చట్టాల అమలు సజావుగా జరిగేందుకు అవసరమైతే కార్మిక శాఖ అధికారులకు శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని కూడా అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.
సమావేశంలో దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్స్ అమలు పురోగతిని సమీక్షించడంతో పాటు కార్మిక సంస్కరణలు, కార్మిక సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.
