భూపాలపల్లిలో విషాదం.. విధుల్లో ఉన్న ఆర్టీవో వెంకన్నను ఢీకొట్టిన లారీ, అక్కడికక్కడే మృతి
వాహనాల తనిఖీల సందర్భంగా ఘోర ప్రమాదం.. 17 రోజుల క్రితమే జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంకన్న దుర్మరణం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 22 :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీవో) వెంకన్నను ఓ లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
సమాచారం మేరకు, సుమారు 17 రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన వెంకన్న విధుల్లో భాగంగా సోమవారం ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఓ లారీ నేరుగా ఆయనను ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది.
వెంకన్న ఆకస్మిక మరణంతో జిల్లా రవాణా శాఖతో పాటు భూపాలపల్లి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వరకు భూపాలపల్లి జిల్లా ఆర్టీవోగా పనిచేసిన మహమ్మద్ సంధాని జగిత్యాల జిల్లాకు బదిలీ కాగా, ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా నుంచి వెంకన్న భూపాలపల్లికి బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఇలాంటి దుర్ఘటన జరగడం అందరినీ కలచివేసింది.
అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక లారీ డ్రైవర్ కావాలనే ఆర్టీవోను ఢీకొట్టాడా? అన్న అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో జిల్లా అధికార వర్గాలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. వెంకన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
