మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామికి ఘన సన్మానం.. “కాకా వెంకటస్వామి వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ”
హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రి పదవిలో విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో జై భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ సామాజిక, కార్మిక, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరై మంత్రిని అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దివంగత జి. వెంకటస్వామి (కాకా) ప్రజల కోసం జీవితాంతం సేవ చేసిన నాయకుడని కొనియాడారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, తన తండ్రి కాకా వెంకటస్వామి వ్యక్తి మాత్రమే కాదని, ఒక వ్యవస్థ (Institution) అని అన్నారు. ప్రజల ప్రయోజనాల విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదని, చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని పాటించారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ గొంతుకకు వేదికగా నిలిచే మీడియా అవసరమనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ V6 ఛానల్‌ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, వారి గొంతుకను వినిపించడం లక్ష్యంగానే V6ను ప్రారంభించామని చెప్పారు.
రాష్ట్రంలో కనీస వేతనాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించామని, పరిశ్రమలు, కార్మిక సంఘాలు, ప్రభుత్వ విభాగాలతో చర్చించి కనీస వేతనాల ప్రకటనకు కృషి చేసినట్లు తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATCs) ద్వారా యువతకు ఆధునిక నైపుణ్యాలు అందిస్తున్నామని, జపాన్, జర్మనీ, యూరప్ దేశాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, టెక్నీషియన్లకు భారీ డిమాండ్ ఉందని మంత్రి పేర్కొన్నారు. భాషా శిక్షణతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు సూచించారు.
అలాగే TOMCOM ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, విదేశాల్లో ఉద్యోగాలు పొందిన యువత నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సిఫారసులు లేదా రాజకీయ పరిచయాలు అవసరం లేకుండా ప్రతిభ ఆధారంగానే ఈ అవకాశాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు.
రాజకీయ విమర్శలపై స్పందిస్తూ, ప్రజా సేవ ద్వారానే ఎన్నికల్లో విజయం సాధించవచ్చని, కాకా వెంకటస్వామి కుటుంబం ప్రజల విశ్వాసాన్ని సేవల ద్వారానే సంపాదించుకుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు కూడా మంత్రి వెల్లడించారు.
చివరగా, కార్మికులు, యువత, పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తానని, తెలంగాణ అభివృద్ధి, ఉపాధి కల్పన, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమమే తన లక్ష్యాలని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
