రూ.3.5 లక్షల జీతం.. కానీ చేతిలో మిగిలేది రూ.50 వేలే..! బెంగళూరు టెక్కీ ఆవేదన వైరల్
నెలకు రూ.3.5 లక్షల జీతం అందుకుంటున్నప్పటికీ సేవింగ్స్ చేయలేకపోతున్నానంటూ బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. వార్షికంగా రూ.96 లక్షల ప్యాకేజీ ఉన్నా, పెరుగుతున్న కుటుంబ ఖర్చులు, రుణాల భారంతో నెలాఖరుకు చేతిలో పెద్దగా డబ్బు మిగలడం లేదని అతడు వెల్లడించాడు.
34 ఏళ్ల ఈ టెక్కీకి నాలుగేళ్ల వయస్సున్న కవల పిల్లలు ఉన్నారు. పన్నులు మినహాయించిన తర్వాత తనకు నెలకు సుమారు రూ.3.5 లక్షల ఆదాయం వస్తుందని తెలిపాడు. అయితే కంపెనీ ఇచ్చిన ఈసాప్‌లు (ESOPs) పక్కన పెడితే, నెలాఖరుకు కేవలం రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే మిగులుతోందని పేర్కొన్నాడు.
తన నెలవారీ ఖర్చులను కూడా అతడు వివరించాడు. ఇంటి రుణం ఈఎంఐకి రూ.80 వేలు, కారు రుణానికి రూ.30 వేలు చెల్లిస్తున్నట్లు తెలిపాడు. పిల్లల డేకేర్, ప్రీ-స్కూల్ ఫీజుల కోసం రూ.50 వేలు, పిల్లల సంరక్షణ కోసం కేర్‌టేకర్‌కు రూ.40 వేలు ఖర్చవుతున్నాయని చెప్పాడు. అదనంగా వంటమనిషికి రూ.6 వేలు, కిరాణా కోసం రూ.20 వేలు, జిమ్‌కు రూ.8 వేలు, కరెంట్, గ్యాస్ బిల్లులకు రూ.15 వేలు, ప్రయాణాల కోసం మరో రూ.40 వేల వరకు ఖర్చవుతోందని వెల్లడించాడు.
ఇప్పటికే తన నెట్ వర్త్ సుమారు రూ.3 కోట్లు ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లుగా సేవింగ్స్‌లో పెద్దగా పెరుగుదల లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగ ఒత్తిడి కారణంగా కొంతకాలం విరామం తీసుకోవాలనిపించినా, కుటుంబ ఖర్చులు, ఆర్థిక బాధ్యతలు చూసి ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నానని తెలిపాడు. ఒకవేళ ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ఎప్పుడూ వెంటాడుతోందని పేర్కొన్నాడు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు హోమ్ లోన్ ఈఎంఐ కూడా ఒక పెట్టుబడేనని, అతడు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తుండగా, మరికొందరు జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఖర్చులను తగ్గించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. మరోవైపు, అధిక ఆదాయం ఉన్నవారికీ ఆర్థిక భద్రతపై భయాలు ఉండటం నేటి నగర జీవనశైలి సవాళ్లను ప్రతిబింబిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
