సిగాచి బాధితులకు రూ.1 కోటి పరిహారం వచ్చే వరకు కంపెనీని వదిలిపెట్టం: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హరీష్ రావు రాజకీయాల కోసం అసత్య ప్రచారం మానుకోవాలి – కాంగ్రెస్ ప్రభుత్వం బాధితులకు పూర్తి న్యాయం చేస్తుందని స్పష్టం
గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో బాధిత కార్మికులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు సిగాచి కంపెనీపై ప్రభుత్వ ఒత్తిడి కొనసాగుతుందని, కంపెనీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సిగాచి ప్రమాదంపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
సిగాచి ప్రమాదంలో 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్న మంత్రి, ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి, వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.
తాను, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహాతో కలిసి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వం మొదటి నుంచే బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు.
సిగాచి యాజమాన్యాన్ని పలుమార్లు పిలిపించి బాధితులకు తగిన పరిహారం చెల్లించేలా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితంగానే మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు దాదాపు రూ.50 లక్షల చొప్పున పరిహారం అందిందని చెప్పారు.
యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కఠిన చర్యలు తీసుకున్నామని, పలు చట్టపరమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కంపెనీ సీఎండీని అరెస్ట్ చేశామని మంత్రి వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీలు కూడా తనిఖీలు నిర్వహించి చట్టప్రకారం చర్యలు చేపట్టారని చెప్పారు.
బాధితులకు పూర్తి న్యాయం జరగాలనే ప్రభుత్వ వైఖరిని హైకోర్టులో కూడా స్పష్టం చేశామని పేర్కొన్న మంత్రి, బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందే వరకు ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 60 మందికి పైగా భక్తులు మరణించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఘటనాస్థలికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల తారుమారుతో 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
“సిగాచి బాధిత కార్మికుల కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనక్కి తగ్గదు. రూ.1 కోటి పరిహారం అందే వరకు కంపెనీని వదిలిపెట్టం. బాధ్యులపై కఠిన చర్యలు కొనసాగుతాయి” అని మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
