న్యాయ వ్యవస్థ బలోపేతానికి సంస్కరణలు అవసరం: మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి
ప్రభుత్వం–న్యాయ వ్యవస్థ మధ్య సమతుల్యత ప్రజాస్వామ్యానికి బలమని వ్యాఖ్య… నిరంతర అధ్యయనంతో యువ న్యాయవాదులు రాణించాలని పిలుపు
ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత పటిష్ఠంగా కొనసాగాలంటే న్యాయ వ్యవస్థలో కాలానుగుణ సంస్కరణలు అవసరమని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ తమ తమ పరిధిలో సమర్థవంతంగా పనిచేస్తూ సమతుల్యతను పాటించినప్పుడే ప్రజాస్వామ్య విలువలు బలపడతాయని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని ఫ్యాప్సీలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లీగల్ కాంక్లేవ్‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, యువ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజకీయాలు, మీడియా సహా అనేక రంగాల్లో కాలానుగుణంగా సంస్కరణలు జరుగుతున్నట్లే న్యాయ వ్యవస్థలోనూ అవసరమైన సంస్కరణలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయ వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు మరింత బలపడే పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే ప్రభుత్వం–న్యాయ వ్యవస్థ మధ్య సమతుల్యత అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సదస్సు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే సూచనలకు వేదిక కావాలని ఆకాంక్షించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్రను గుర్తు చేసిన మంత్రి, కాంగ్రెస్ నాయకత్వంలో సాగిన స్వాతంత్ర్య సమరంలో అనేక మంది న్యాయవాదులు ఉద్యమకారుల తరఫున కోర్టుల్లో వాదించి కీలక విజయాలు సాధించారని తెలిపారు. న్యాయవాద వృత్తి ప్రతి అంశాన్ని అనుకూల, ప్రతికూల కోణాల్లో విశ్లేషించే అవకాశం కల్పిస్తుందని, దీంతో సమాజ సమస్యలపై సమగ్ర అవగాహన పెరుగుతుందని అన్నారు.
యువ న్యాయవాదులు నిరంతరం అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. కోర్టుల్లో జరుగుతున్న వాదనలు వినడం, తాజా న్యాయ తీర్పులు, చట్టాలను అధ్యయనం చేయడం, ఎక్కువ కేస్ స్టడీస్ చదవడం ద్వారా వృత్తిపరమైన నైపుణ్యం పెంపొందుతుందని చెప్పారు. యూత్ కాంగ్రెస్ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యువ న్యాయవాదులు న్యాయ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
ఈ నేషనల్ లీగల్ కాంక్లేవ్‌లో రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ వ్యవస్థ బలోపేతం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణతో పాటు సమకాలీన న్యాయ అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి.
