తెలంగాణ నర్సులకు విదేశాల్లో భారీ ఉద్యోగాలు.. టామ్‌కామ్–గ్లోబల్ నర్స్ ఫోర్స్ మధ్య ఎంఓయూ
అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ, భాషా కోర్సులు, ప్లేస్మెంట్ సౌకర్యాలు.. జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాల్లో అవకాశాలు: మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జూలై 20: తెలంగాణకు చెందిన అనుభవజ్ఞులైన నర్సులకు విదేశాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన నర్సులను గుర్తించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ అందించి, తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ (టామ్‌కామ్) ద్వారా విదేశాలకు పంపించే ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా టామ్‌కామ్ (TOMCOM) మరియు గ్లోబల్ నర్స్ ఫోర్స్ (Global Nurse Force) మధ్య సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందం రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, యూరప్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో నైపుణ్యం కలిగిన భారతీయ నర్సులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోందన్నారు. ఆ అవకాశాలను తెలంగాణ యువతకు అందించేందుకు ప్రభుత్వం టామ్‌కామ్ ద్వారా సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన నర్సులను గుర్తించడం, ఇంటర్వ్యూలు నిర్వహించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందించడం, విదేశీ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
టామ్‌కామ్–గ్లోబల్ నర్స్ ఫోర్స్ భాగస్వామ్యంతో నర్సులకు విదేశీ ఉద్యోగాలకు అవసరమైన జర్మన్‌తో పాటు ఇతర విదేశీ భాషల శిక్షణ, క్లినికల్ కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, వీసా, లైసెన్సింగ్, ప్లేస్మెంట్ వంటి అంశాల్లో సమగ్ర సహకారం అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్‌తో పాటు ఇతర దేశాల్లో నాణ్యమైన ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని చెప్పారు.
విదేశీ ఉపాధి కార్యక్రమాలు తెలంగాణ యువతకు మాత్రమే కాకుండా ఆతిథ్య దేశాల ఆరోగ్య రంగ అవసరాలను కూడా తీర్చే విధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. అభ్యర్థులకు అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ అందించి, అంతర్జాతీయ ఆరోగ్య రంగ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలని గ్లోబల్ నర్స్ ఫోర్స్ ప్రతినిధులను కోరారు. శిక్షణ, నియామకాల నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయని, అనుభవజ్ఞులైన నర్సులతో పాటు కొత్తగా నర్సింగ్ పట్టభద్రులవుతున్న యువత కూడా విదేశీ ఉద్యోగాలపై ఆసక్తి చూపడం సానుకూల పరిణామమని మంత్రి అన్నారు. తెలంగాణ నైపుణ్యాన్ని ప్రపంచ ఉపాధి అవకాశాలతో అనుసంధానం చేసే విశ్వసనీయ వేదికగా టామ్‌కామ్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి మరియు శిక్షణ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐఏఎస్, టామ్‌కామ్ జనరల్ మేనేజర్, గ్లోబల్ నర్స్ ఫోర్స్ ప్రతినిధి పరమానంద సంత్రా తదితరులు పాల్గొన్నారు.
