తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగాల బాట.. టామ్‌కామ్–కెరీర్ కన్సల్ట్జ్ భాగస్వామ్యం
మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవగాహన ఒప్పందం.. జపాన్, జర్మనీ సహా ఆరు దేశాల్లో ఉపాధి అవకాశాలు
హైదరాబాద్, జూలై 22: తెలంగాణ యువతకు నైతిక, పారదర్శక, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) మరో కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో టామ్‌కామ్ మరియు కెరీర్ కన్సల్ట్జ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రతిని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు, గనుల శాఖ మంత్రి, టామ్‌కామ్ చైర్మన్ డా. జి. వివేక్ వెంకటస్వామి అధికారికంగా అందజేశారు.
టామ్‌కామ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎ. నిర్మల కాంతి వెస్లీ, ఐఏఎస్, కెరీర్ కన్సల్ట్జ్ సీఈఓ శ్రీ మేనేని రోహిత్ రావు మధ్య కుదిరిన ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువతకు సురక్షితమైన, నాణ్యమైన విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. టామ్‌కామ్ ద్వారా నైపుణ్యాభివృద్ధి, అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరిస్తూ తెలంగాణను విదేశీ ఉపాధిలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, ఫిన్లాండ్, ఇటలీ, నార్వే దేశాల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, విదేశీ భాషా శిక్షణ, కెరీర్ కౌన్సెలింగ్, ఇంటర్వ్యూ సిద్ధత, డాక్యుమెంటేషన్, వీసా సహాయం, విదేశీ ఉద్యోగాల్లో నియామకం, ఉద్యోగంలో చేరిన అనంతరం అవసరమైన సహాయాన్ని అందించనున్నారు.
అంతర్జాతీయ కెరీర్ మార్గదర్శకత్వం, విదేశీ ఉపాధి సేవల్లో అనుభవం కలిగిన కెరీర్ కన్సల్ట్జ్ సంస్థ టామ్‌కామ్‌తో కలిసి తెలంగాణ యువతను ప్రపంచ ఉద్యోగ విపణికి సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.
మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో, టామ్‌కామ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఎ. నిర్మల కాంతి వెస్లీ, ఐఏఎస్ పరిపాలనా మార్గదర్శకత్వంలో టామ్‌కామ్ నైతిక నియామక విధానాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్ర విదేశీ ఉపాధి వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని అధికారులు తెలిపారు.
కెరీర్ కన్సల్ట్జ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణకు చెందిన వేలాది మంది యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, బాధ్యతాయుతమైన అంతర్జాతీయ కార్మిక వలసలను ప్రోత్సహించే టామ్‌కామ్ లక్ష్యానికి తమ వంతు సహకారం అందించడం గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టామ్‌కామ్ జనరల్ మేనేజర్ నాగభారతి, అధికారులు షబానా, అనిల్, జపాన్ ప్రతినిధి సయూరి మత్సునో, కెరీర్ కన్సల్ట్జ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
