రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ.. మంత్రి సహా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, జూలై 22: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీల అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ర్యాలీలో రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకుని, మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, విద్యార్థులు, యువత సమస్యలపై గళమెత్తిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని తీవ్రంగా విమర్శించారు.
యువతకు ఉద్యోగాలు కల్పించాలని, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ లెక్కన ఇప్పటివరకు సుమారు 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుండా దేశ యువతను నిరాశపరిచిందని విమర్శించారు.
దేశ యువతకు ఉపాధి, భద్రత కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి, వారి తరఫున మాట్లాడుతున్న ప్రతిపక్ష నాయకులపై దమనకాండకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు.
విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, కాంగ్రెస్ అగ్రనేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, యువత భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ఉద్యమం నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
