ఏటీసీలతో యువతకు ఉపాధి బాట.. రుద్రంగిలో ఏటీసీకి మంత్రి వివేక్ భూమిపూజ
నైపుణ్య శిక్షణ నుంచి విదేశీ ఉద్యోగాల వరకు ప్రభుత్వ అండ – జర్మనీ, జపాన్‌లో రూ.2 లక్షలకు పైగా వేతన అవకాశాలు
రుద్రంగి, ఆగస్టు 4: తెలంగాణ యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించి దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగిలో నూతన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేసి మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మొత్తం 120 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కృత్రిమ మేధ (AI), ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతిక రంగాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం యువత తిరగాల్సిన అవసరం లేకుండా శిక్షణ నుంచి ప్లేస్మెంట్ వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రుద్రంగి ఏటీసీలో వ్యవసాయ ఆధారిత ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని డీఈటీ, టామ్‌కామ్ డైరెక్టర్ కాంతి వెస్లీకి మంత్రి సూచించారు. ఇందుకోసం ఇక్రిశాట్‌తో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.
ఏటీసీలు, ఐటీఐల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైపెండ్ అందిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవ్వరూ విద్యను మధ్యలో వదిలిపెట్టకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. శిక్షణ ఇచ్చి బాధ్యత ముగిసిపోదని, ఉద్యోగం వచ్చే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
జర్మన్ భాష నేర్చుకుంటే విదేశాల్లో భారీ అవకాశాలు
టామ్‌కామ్ ద్వారా తెలంగాణ యువతకు జర్మనీ, జపాన్ తదితర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. నర్సులు, ఎలక్ట్రీషియన్లు, కేర్గివర్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు. రుద్రంగి నుంచి 100 మంది యువతను ఎంపిక చేస్తే జర్మన్ భాష శిక్షణకు ప్రత్యేక ట్రైనర్‌ను పంపించడంతో పాటు శిక్షణ అనంతరం టామ్‌కామ్ ద్వారా ఉద్యోగాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
మందమర్రిలో ఇప్పటికే 100 మందికి జర్మన్ భాషలో శిక్షణ కొనసాగుతోందని, జర్మనీ, జపాన్లలో నైపుణ్యం, భాషా ప్రావీణ్యం ఉన్న వారికి నెలకు రూ.2 లక్షలకు పైగా వేతనం లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వచ్చే వారంలోనే విదేశీ ఉపాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఐటీఐలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
గత పదేళ్లలో ఐటీఐలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆధునిక ఏటీసీలుగా అభివృద్ధి చేసి యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై విమర్శలు
తెలంగాణ యువత జర్మన్ భాష నేర్చుకోవడాన్ని ఎగతాళి చేయడం బాధాకరమని మంత్రి అన్నారు. విదేశాల్లో మంచి ఉద్యోగాలు సాధించి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుంటే రాజకీయ విమర్శల కోసం యువత భవిష్యత్తును చిన్నచూపు చూడొద్దని సూచించారు.
కాళేశ్వరం వల్ల భారీ ఆర్థిక భారం
కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా మంత్రి స్పందించారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ప్రణాళికను మార్చి భారీ ఎత్తిపోతల విధానాన్ని తీసుకురావడంతో నిర్మాణ వ్యయంతో పాటు విద్యుత్ భారం కూడా రాష్ట్రంపై పెరిగిందన్నారు. గ్రావిటీ ద్వారా నీటి సరఫరా అవకాశాలను పక్కనపెట్టి పంపింగ్‌పై ఆధారపడే విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆది శ్రీనివాస్‌పై ప్రశంసలు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. ఆయన ప్రజల సమస్యలపై పూర్తి అవగాహనతో అభివృద్ధి ప్రతిపాదనలు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయనకు మరింత ఉన్నత బాధ్యతలు రావాలని ఆకాంక్షించారు.
రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్
వేములవాడ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వైద్య సదుపాయాల విస్తరణతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన నైపుణ్యాభివృద్ధి సమావేశంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏటీసీ మోడల్‌కు కేంద్రం ప్రశంసలు తెలిపిందని మంత్రి వెల్లడించారు. పీఎం సేతు పథకంలో తెలంగాణకు మూడు క్లస్టర్లు రావడం రాష్ట్రం నైపుణ్యాభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు.
