HyderabadLatestTelangana

ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

మెదక్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి

మెదక్, ఆగస్టు 15: మెదక్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలకు శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్), గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు పరేడ్‌ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి రాష్ట్ర, దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ తదితర స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమ వీరులకు ఘన నివాళులు అర్పించారు.

రాజ్యాంగ విలువలను కాపాడాలి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మార్గదర్శకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచస్థాయిలో ముందంజలో నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.

సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రయోజనం

మహాలక్ష్మి పథకం ద్వారా మెదక్ జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 4.49 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించగా, వారికి రూ.161.49 కోట్ల మేర ప్రయోజనం కలిగిందన్నారు.

గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో 1,29,756 మంది విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.108.80 కోట్ల సబ్సిడీ భరించిందన్నారు.

రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని, మెదక్ జిల్లాలో 2,66,674 మంది రైతుల ఖాతాల్లో రూ.751.84 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 28,933 ఎకరాల్లో కంది, పెసర, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, ఆముదం, కూరగాయలు, ఆయిల్‌పామ్ తదితర పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు.

యాసంగి 2025–26లో రైతులకు కనీస మద్దతు ధర అందేలా జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 4,25,305 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రైతులకు ఇప్పటివరకు రూ.1,116.06 కోట్లు చెల్లించినట్లు చెప్పారు.

ఆరోగ్య సేవలకు ప్రాధాన్యం

రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 39,339 మంది పేదలకు వైద్య సేవలు అందించామని, ఇందుకోసం రూ.110.84 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.

జిల్లాలోని 1,076 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. వేలాది మంది గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఉచిత పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.

మహిళలు, పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 1.27 లక్షల మంది లబ్ధిదారులకు 8,64,388 సిలిండర్లు అందించామని, ఇందుకోసం రూ.26.14 కోట్ల సబ్సిడీ భరించినట్లు తెలిపారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం

దేశంలోనే తొలి కార్యక్రమంగా తెలంగాణ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతోందని మంత్రి తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అందుతాయని చెప్పారు.

మెదక్ జిల్లాలో 2,41,393 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు.

విద్య, ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట

2026–27 విద్యా సంవత్సరంలో మెదక్ జిల్లాలోని 905 ప్రభుత్వ పాఠశాలల్లో 72,896 మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. కార్పొరేట్, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా విద్య అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.

రామాయంపేటలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 2,500 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలతో ప్రపంచస్థాయి విద్య అందించడమే లక్ష్యమన్నారు.

ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో తొలి విడతగా 8,955 ఇళ్లు మంజూరు చేసి రూ.447.75 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. మంజూరైన ఇళ్లలో 7,382 నిర్మాణాలు ప్రారంభం కాగా, 4,353 ఇళ్లు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని వివరించారు.

డిజిటల్ భూసర్వేలో మెదక్ ముందంజ

రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ భూసర్వే చేపడుతున్నామని మంత్రి తెలిపారు. మెదక్ జిల్లాలో తొలి విడతగా 24 నాన్‌-క్యాడస్ట్రల్ గ్రామాలు, రెండో విడతగా 70 క్యాడస్ట్రల్ గ్రామాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 10 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు.

మహిళా సంఘాలకు రూ.610 కోట్ల రుణ లక్ష్యం

మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకు రుణాలను పెద్ద ఎత్తున అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 12 వేల సంఘాలకు రూ.610.72 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలనే లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1,819 సంఘాలకు రూ.145.62 కోట్ల రుణాలు అందించినట్లు తెలిపారు.

జిల్లాలోని 20 మండల సమాఖ్యలకు రూ.7.20 కోట్లతో 20 బస్సులు కొనుగోలు చేసి టీజీఎస్‌ఆర్టీసీకి అప్పగించినట్లు చెప్పారు. ప్రతి మండల సమాఖ్యకు నెలకు సుమారు రూ.69,468 ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.

ఉపాధి, నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం

కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో మెదక్‌లో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు అనుగుణంగా శిక్షణా కోర్సులు రూపొందిస్తున్నామని చెప్పారు.

దేశీయ పరిశ్రమలతో పాటు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా యువతకు TOMCOM ద్వారా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో నైపుణ్యం కలిగిన వారికి ఏడాదికి రూ.25 లక్షలకు పైగా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని, మెదక్ జిల్లా యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

మెదక్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి తెలిపారు. ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద వసతి సౌకర్యాల ఏర్పాటుకు రూ.7 కోట్లు, మెదక్ కోట పునరుద్ధరణకు రూ.57 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో టూరిజం డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

పోలీసులకు అభినందనలు

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడిలో కృషి చేస్తున్న పోలీసు శాఖను మంత్రి అభినందించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు.

ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు నిర్వహించామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులు, పోలీసు సిబ్బందికి మంత్రి మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.

Cyber Post

About Cyber Post Cyber Post is a leading online news portal based in Hyderabad, dedicated to delivering accurate, timely, and trustworthy news to readers across India and beyond. Guided by our tagline — “News You Can Trust” — we are committed to upholding the highest standards of journalism in an era of rapid digital transformation and information overload. At Cyber Post, our mission is simple yet powerful: to inform, inspire, and empower our audience with credible reporting, insightful analysis, and unbiased coverage. Our team of experienced journalists and digital media professionals work around the clock to bring you the latest updates from politics, business, technology, entertainment, sports, and current affairs — all presented with integrity and clarity. Founded in Hyderabad, the city’s dynamic spirit of innovation and diversity inspires our approach to journalism. Whether it’s breaking news, investigative reports, or community stories, Cyber Post stands as a trusted source for truth in the digital age. With a growing readership and a reputation for credibility, Cyber Post continues to redefine digital news by blending traditional journalistic values with modern storytelling and technology. Cyber Post – News You Can Trust.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *