మెట్రోకు 1 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాలి
హైదరాబాద్ మెట్రోను లాభదాయకంగా మార్చేందుకు కేంద్రం సహకరించాలి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి
తూప్రాన్‌లో సాబర్ డెయిరీ (అమూల్) ప్లాంట్‌కు భూమిపూజ
తూప్రాన్, అక్టోబర్ 4: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ఆర్థికంగా లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు. రైల్వే కార్పొరేషన్ ద్వారా మెట్రోకు 1 శాతం నామమాత్రపు వడ్డీతో రుణాలు అందించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు. మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్యను 10 లక్షలకు పెంచేలా కేంద్రం అవసరమైన సహకారం అందించాలని కోరారు.
మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో సాబర్ డెయిరీ (అమూల్) ప్లాంట్ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్‌బాబు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, మెదక్ కలెక్టర్, అమూల్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటీవల కామన్ పాస్‌ను ప్రారంభించామని, గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులకు మెట్రో మరింత అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు.
రోజువారీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షలకు చేరితే మెట్రో ప్రాజెక్టు మరింత విజయవంతంగా, ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందేలా కిషన్‌రెడ్డి చొరవ చూపాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల పోషకాహారానికి అమూల్ దోహదం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల పోషకాహార భద్రతకు అమూల్ ప్లాంట్ ఎంతో దోహదపడుతుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. తూప్రాన్‌లో ఇలాంటి పరిశ్రమను తీసుకురావడంలో కృషి చేసిన మెదక్ ఎంపీ రఘునందన్‌రావును అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉదయం అల్పాహార పథకంలో భాగంగా విద్యార్థులకు పాలు అందిస్తున్నామని తెలిపారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రోజుకు 100 మిల్లీలీటర్లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 150 మిల్లీలీటర్ల చొప్పున పాలు అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఏటా సుమారు 4 కోట్ల లీటర్ల పాలు అవసరమవుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం అవసరమైన పాలలో దాదాపు 50 శాతం ఇతర ప్రాంతాల నుంచి సేకరించాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలోనే అమూల్ వంటి ప్లాంట్ అందుబాటులోకి రావడంతో పాల సేకరణ, సరఫరా మరింత సులభతరం అవుతుందని చెప్పారు.
నాణ్యతతోనే అమూల్‌కు విశ్వసనీయత
చిన్ననాటి నుంచే అమూల్ పాలు, వెన్నపై ప్రజల్లో విశ్వాసం ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. వ్యాపార రంగంలో ఉన్న సమయంలో ముంబయికి వెళ్లినప్పుడు అమూల్ సంస్థ రూపొందించే వినూత్న ప్రచార హోర్డింగులు తనను ఆకట్టుకునేవని గుర్తుచేశారు. ఎన్నో ఏళ్లుగా నాణ్యత, నిబద్ధతతో పనిచేయడం వల్లే అమూల్ దేశంలో విశ్వసనీయమైన బ్రాండ్‌గా ఎదిగిందన్నారు.
తెలంగాణలో విద్యార్థులకు రుచికరమైన అల్పాహారంతో పాటు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.
చెన్నూరులోనూ అమూల్ యూనిట్ ఏర్పాటు చేయాలి
చెన్నూరు నియోజకవర్గంలోనూ అమూల్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని అమూల్ యాజమాన్యానికి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. చెన్నూరు ప్రాంతంలో పాల ఉత్పత్తికి, మార్కెటింగ్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
చెన్నూరుకు సమీపంలోనే మహారాష్ట్ర మార్కెట్ ఉండటంతో పాల ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వివరించారు. చెన్నూరులో అమూల్ యూనిట్ ఏర్పాటు చేస్తే స్థానిక రైతులకు స్థిరమైన మార్కెట్ లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.
