నాగర్ కర్నూల్లో డ్రంకన్ డ్రైవ్పై ఉక్కుపాదం.. వాహనదారుడికి రెండు రోజుల జైలు
మద్యం తాగి డ్రైవింగ్ చేసిన వ్యక్తికి రూ.1,700 జరిమానా
నాగర్ కర్నూల్: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నాగర్ కర్నూల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తికి న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,700 జరిమానా విధించింది.
పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామ్ గోపాల్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ఈ వివరాలను నాగర్ కర్నూల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. వెంకట్ రెడ్డి వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని సూచించారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని ఎస్ఐ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
