ఇండో–జపాన్ స్నేహబంధానికి కళలు వారధిగా నిలవాలి
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇండో–జపాన్ కళా ప్రదర్శనను సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, అక్టోబర్ 14: కళలు, సంస్కృతి రెండు దేశాల ప్రజల మధ్య స్నేహసంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. భారతదేశం, జపాన్ మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందించడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ కళాకారుడు వెంకట్ గడ్డం, జపాన్కు చెందిన కళాకారిణి హిరోకో తకయామా సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇండో–జపాన్ కళా ప్రదర్శనను బుధవారం ఆయన సందర్శించారు. ప్రదర్శనలోని పెయింటింగ్స్, వస్త్రాలపై రూపొందించిన కళాకృతులు, ఇతర కళారూపాలను ఆసక్తిగా తిలకించి కళాకారులను అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెంకట్ గడ్డం, హిరోకో తకయామా కళల ద్వారా ఇండో–జపాన్ స్నేహబంధాన్ని చాటిచెబుతున్న తీరు అభినందనీయమన్నారు. భారతీయ, జపనీస్ కళలు, సంస్కృతులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. ఇటీవల జపాన్లోని హిరోషిమా, మియోషి నగరాల్లోనూ కళా ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇండో–జపనీస్ కళా సంప్రదాయాలను విస్తృతంగా పరిచయం చేయడం సంతోషకరమన్నారు.
వెంకట్ గడ్డం చిన్నప్పటి నుంచే అసాధారణ కళా ప్రతిభను కనబరిచారని మంత్రి కొనియాడారు. కేవలం ఆరేళ్ల వయసులోనే గిన్నిస్ బుక్లో రికార్డులు సాధించడం ఆయన ప్రతిభకు నిదర్శనమన్నారు. పదేళ్ల వయసులోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కళాభవన్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం విశేషమని పేర్కొన్నారు.
వెంకట్ తన చిత్రాల్లో సంతోషం, బాధ సహా విభిన్న భావోద్వేగాలను అద్భుతంగా ప్రతిబింబిస్తూ ప్రజల మనసులను ఆకట్టుకుంటున్నారని మంత్రి ప్రశంసించారు. మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా ఆయన చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఐదేళ్ల కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆయన సృజనాత్మక ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు.
జపాన్కు చెందిన కళాకారిణి హిరోకో తకయామా భారతీయ కళాకారులతో కలిసి ఈ ప్రదర్శనలో పాల్గొనడం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. బుద్ధుడి ఆలోచనలు, బోధనలు, స్ఫూర్తితో రూపొందించిన కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని తెలిపారు. కళలకు భాష, దేశాల సరిహద్దులు అడ్డుకావని, భావోద్వేగాలు, సృజనాత్మకత ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అనుసంధానించవచ్చని అన్నారు.
ఈ కళా ప్రదర్శనలో పెయింటింగ్స్, వస్త్రాలపై రూపొందించిన ప్రత్యేక కళాకృతులు, కవితలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కళాభిమానులు ప్రదర్శనను సందర్శించి కళాకారుల సృజనాత్మకతను ఆస్వాదించాలని మంత్రి సూచించారు.
అనంతరం కళాకారులు వెంకట్ గడ్డం, హిరోకో తకయామాతో మంత్రి ముచ్చటించారు. వారి సృజనాత్మక ఆలోచనలు, ఇండో–జపాన్ కళా సంబంధాలు, భవిష్యత్తులో చేపట్టనున్న సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు. కళలు, సంస్కృతి ద్వారా అంతర్జాతీయ స్నేహబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
