భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ప్రక్షాళన
2018 నుంచి క్లెయిమ్‌లపై సమగ్ర విజిలెన్స్ విచారణ.. ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న అధికారుల బదిలీ
అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించం.. సిఫారసు లేఖతో క్లెయిమ్ మంజూరైనట్లు వచ్చిన వార్తలు అవాస్తవం: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, అక్టోబర్ 15: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధుల పరిరక్షణ, పరిపాలనలో పారదర్శకత లక్ష్యంగా కార్మిక శాఖలో సమూల ప్రక్షాళన చేపడతామని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను ప్రక్షాళన చేయడంతో పాటు, ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న అధికారులను త్వరలో బదిలీ చేస్తామని వెల్లడించారు. కార్మికుల సంక్షేమానికి కేటాయించిన ప్రతి రూపాయి సక్రమంగా వినియోగమయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
సచివాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కార్మిక శాఖలో క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతో ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశామని, ఈ వ్యవహారంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించామని తెలిపారు. విచారణలో అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
2018 నుంచి అన్ని క్లెయిమ్‌ల పరిశీలన
కార్మికుల పరిహార క్లెయిమ్‌ల పరిష్కారంలో పారదర్శకత లోపించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. బోగస్ పత్రాలు, నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అక్రమంగా క్లెయిమ్‌లు పొందినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, 2018 నుంచి ఇప్పటివరకు నమోదైన అన్ని రకాల క్లెయిమ్‌లను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
జాయింట్ లేబర్ కమిషనర్ స్థాయిలో ప్రాథమిక విచారణ నిర్వహించిన అనంతరం ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నామని, తదుపరి దర్యాప్తు కోసం విజిలెన్స్ విచారణకు ఆదేశించామని వివరించారు. నెల లేదా రెండు నెలల్లో విజిలెన్స్ నివేదిక వచ్చే అవకాశం ఉందని, నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
క్లెయిమ్‌ల పరిశీలన, పరిహారం మంజూరు, చెల్లింపుల బాధ్యత సంబంధిత కార్మిక శాఖ అధికారులదేనని పేర్కొన్నారు. బోర్డులోని విధానాలను సమీక్షించి, అక్రమాలకు అవకాశం లేకుండా ప్రక్రియలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. వివిధ సంస్థలు, నిర్మాణదారుల నుంచి వసూలు కావాల్సిన వందల కోట్ల రూపాయల లేబర్ సెస్సును నిబంధనల ప్రకారం జరిమానాలతో సహా వసూలు చేస్తామని తెలిపారు.
సిఫారసు లేఖపై వచ్చిన వార్తలు అవాస్తవం
తన సిఫారసు లేఖ ఆధారంగా కార్మికుల పరిహార క్లెయిమ్ మంజూరైనట్లు ఓ పత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను ఆశ్రయించడం సహజమని, సంబంధిత అధికారులకు నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించడం సాధారణ విధానమని వివరించారు.
తన వద్దకు వచ్చిన దరఖాస్తుపై నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచించానని తెలిపారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారని, సదరు దరఖాస్తుదారుడికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం చెల్లించలేదని చెప్పారు. చెల్లింపే జరగనప్పుడు తన సిఫారసుతో క్లెయిమ్ మంజూరైనట్లు ప్రచారం చేయడం సరికాదన్నారు. వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ప్రచురించాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
సింగరేణిపై బీఆర్ఎస్ విమర్శలు విడ్డూరం
సింగరేణి సంస్థ పరిస్థితిపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి ఉద్యోగుల సంఖ్య లక్ష నుంచి 38 వేలకు తగ్గిందని, దాదాపు 62 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని ఆరోపించారు. ఆ పదేళ్లలో సంస్థకు ఒక్క కొత్త బొగ్గు గని కూడా రాలేదని పేర్కొన్నారు.
బొగ్గు గనుల వేలం చట్టానికి పార్లమెంట్లో అనుకూలంగా ఓటు వేసింది బీఆర్ఎస్ ఎంపీలేనని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు కేటాయించే అవకాశాలపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసినా, అప్పటి ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో వేలంలో పాల్గొని ఆర్కేఓసీ మైన్‌తో పాటు తాడిచర్లలో మరో గనిని సింగరేణికి దక్కేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
కొత్త గనుల ఏర్పాటు ద్వారా బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. సంస్థ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టడం అత్యవసరమని, సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ విస్తరణకు అవసరమైన నిధులను మూలధన వ్యయం కింద కేటాయించడం సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమేనని తెలిపారు.
డీఎంఎఫ్టీ నిధులను మళ్లించారు
సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరుకు దక్కాల్సిన జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ప్రాంతాలకు మళ్లించిందని మంత్రి ఆరోపించారు. బొగ్గు గనుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, స్థానిక ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన నిధులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం సమంజసం కాదన్నారు.
గత ప్రభుత్వం సింగరేణిపై బకాయిల భారాన్ని మోపిందని, కాంట్రాక్టర్ల బిల్లులు, ఉద్యోగుల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తూ, భవిష్యత్తులో పోటీని తట్టుకునేలా పెట్టుబడులు పెట్టడం ప్రస్తుత ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అప్పుల ఊబిలోకి నెట్టారని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని, గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిలు, అప్పులపై వడ్డీల చెల్లింపులు ప్రస్తుత ప్రభుత్వానికి భారంగా మారాయని అన్నారు.
ప్రజాధనాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల వ్యయం, నిధుల వినియోగంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నేతలపై ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు.
