కోటపల్లి KGBVలో విద్యా మౌలిక వసతులకు రూ.65 లక్షలు
విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట
శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి
కోటపల్లి, నవంబర్ 7: విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. కోటపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో రూ.65 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బాత్రూమ్ల నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.90 లక్షలతో ఎస్సీ హాస్టల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో రూ.200 కోట్ల వ్యయంతో 2,000 మంది విద్యార్థులకు హాస్టల్ వసతితో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. కోటపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరించారు.
విద్యా రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
