ఉప్పల్ అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ ఆకస్మిక దాడులు
క్రాకర్స్ షాప్ పర్మిషన్లకు లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు.. రూ.40 వేల నగదు స్వాధీనం
ఉప్పల్: ఉప్పల్ భగాయత్‌లోని ఎల్బీనగర్ పరిధికి చెందిన అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాపుల ఏర్పాటుకు అనుమతులు తీసుకునేందుకు వచ్చిన దరఖాస్తుదారుల నుంచి కొందరు అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో రంగారెడ్డి ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.
రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు అగ్నిమాపక కేంద్రానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి సీఐతో పాటు మరికొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి రూ.40 వేల నగదును గుర్తించిన అధికారులు, సుమారు 80 ఆన్లైన్ లావాదేవీల వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.
మరోవైపు క్రాకర్స్ షాపుల అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. లంచం డిమాండ్‌కు సంబంధించిన ఆరోపణలు, నగదు లావాదేవీలు, పెండింగ్ దరఖాస్తులపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
