అంత్యక్రియలకు వెళ్లిన వారి ఇళ్లే టార్గెట్!
ఐదు దొంగతనాల కేసులు ఛేదించిన జడ్చర్ల పోలీసులు
62 గ్రాముల బంగారం, 110 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం.. 70 ఏళ్ల పాత నేరస్తుడి అరెస్ట్
జడ్చర్ల: కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్లి ఇళ్లకు తాళాలు వేసి ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదు దొంగతనాల కేసులను ఛేదించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
జడ్చర్ల, మిడ్జిల్, భూత్పూర్, ఉమ్మాజూట్ పరిధిలో ఇళ్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో దొంగతనాలు జరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు వెళ్లిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి, బీరువాలను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలో జడ్చర్లలోని గాంధీ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని బోయ కృష్ణయ్య (70)గా గుర్తించారు. గతంలోనూ పలు దొంగతనాల కేసుల్లో నిందితుడు జైలుకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి నుంచి 62 గ్రాముల బంగారు ఆభరణాలు, 110 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దొంగతనాలకు సంబంధించి ఐదు కేసులను ఛేదించినట్లు వివరించారు.
ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును ఇంట్లో ఉంచవద్దని పోలీసులు సూచించారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
