రూ.7 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన మహిళా సబ్‌రిజిస్ట్రార్
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఒడిశా విజిలెన్స్ అధికారులు.. ప్రొబేషన్‌లోనే ఉద్యోగం కోల్పోయిన అధికారి
బాలాసోర్: ప్రభుత్వ కార్యాలయంలో లంచం తీసుకుంటూ మహిళా సబ్‌రిజిస్ట్రార్ విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన ఘటన ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటుచేసుకుంది. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ చేసిన బలియాపాల్ సబ్‌రిజిస్ట్రార్ మనీషా మిశ్రాను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బలియాపాల్లో ప్రొబేషనరీ సబ్‌రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న మనీషా మిశ్రా.. ఓ భూమి కొనుగోలుదారుడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు విజిలెన్స్ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో బాధితుడి నుంచి రూ.7 వేల నగదు తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు ఆమెను పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఒడిశా రెవెన్యూ సర్వీస్‌కు చెందిన మనీషా మిశ్రా 2024లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ప్రొబేషన్ కాలంలోనే ఉన్న ఆమెపై ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగింపు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కేవలం రూ.7 వేల లంచం తీసుకుంటూ పట్టుబడటంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
