వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యా విధానం!
9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్యాబోధనకు ప్రణాళిక
12వ తరగతి తర్వాత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే 10+2 విద్యా విధానాన్ని అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో విద్యారంగ సంస్కరణలపై పలు కీలక సూచనలు చేశారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు, వారి భవిష్యత్తుకు ఉపయోగపడేలా విద్యా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ప్రతిపాదిత సంస్కరణల అమలుతో ఏ ఒక్క విద్యార్థికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక బోధన
నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. 9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్యాబోధన అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ దశలో విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా విధానాలను అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. 12వ తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం అవసరమైన మౌలిక వసతులను గుర్తించి అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన ప్రమాణాలను మెరుగుపరిచి, ఉన్నత విద్యతోపాటు ఉపాధి అవకాశాల్లోనూ వారు రాణించేలా విద్యా సంస్కరణలు ఉండాలని దిశానిర్దేశం చేశారు.
విద్యా విధానంలో ప్రతిపాదించిన మార్పుల అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
