కశ్మీర్లో సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదుల కాల్పులు
ముగ్గురు జవాన్లకు గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి పరారీ.. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. మిర్ బజార్ సమీపంలోని అక్రాన్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపు లక్ష్యంగా బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు క్యాంపు వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యాహ్నం సుమారు 2.15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన జవాన్లను వెంటనే అంబులెన్స్‌లో అనంతనాగ్ జిల్లాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక జవానుకు పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి చేతులు, కాళ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి.
భద్రత కట్టుదిట్టం.. గాలింపు ముమ్మరం
కాల్పుల ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులు పారిపోయిన మార్గాల్లో తనిఖీలు చేపట్టాయి. కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయుధ వాహనాలతో భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
