దుబ్బాకలో 1,924 మందికి కొత్త పింఛన్లు.. 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
ఏళ్ల నిరీక్షణకు తెర.. లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట, నవంబర్ 16: ఏళ్ల తరబడి కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. దుబ్బాక నియోజకవర్గంలో 1,924 మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. అలాగే రెండో విడతలో మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.
సోమవారం అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని రామలింగేశ్వర గార్డెన్స్‌లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలు, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 1,924 మంది పింఛన్ లబ్ధిదారులకు, 523 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో మరో 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని వెల్లడించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు సుమారు రూ.1,200 ఆదా అవుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.12 వేల కోట్లను ఆర్టీసీకి అందించిందని వివరించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అదనపు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ.2,500 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. దుబ్బాకకు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంపై గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం పేరుకుపోయిందని, వాటికి భారీగా వడ్డీలు చెల్లిస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పథకాలకు ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సిద్దిపేట జిల్లాలో మహిళా సంఘాలకు రూ.330 కోట్ల వడ్డీలేని రుణాలు అందించినట్లు వెల్లడించారు.
ఈ నెల 19న సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు లక్షల ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం మహిళలకు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అర్హులైన వారందరికీ చేయూత పింఛన్లు అందించాలని, దుబ్బాక నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న చేనేత కార్మికులకు కూడా పింఛన్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సిద్దిపేట ఆర్డీవో సదానందం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ధరిపెల్లి చంద్రం, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
