విధి నిర్వహణలో మృతి చెందిన గిగ్ వర్కర్ల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం
రాహుల్ గాంధీ హామీ మేరకు బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, నవంబర్ 22 : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు గిగ్ వర్కర్ల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన హామీ మేరకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్విగ్గీ డెలివరీ వర్కర్ వల్లూరి సందీప్ కుటుంబానికి, ఉబర్ డ్రైవర్ అలుగోలా శ్యామ్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందించారు.
ఆ రోజు రాహుల్ గాంధీ సభకు బాధిత కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడంతో వారి తరఫున గిగ్ వర్కర్లు చెక్కులను స్వీకరించారు. ఈ నేపథ్యంలో శనివారం బాధిత కుటుంబ సభ్యులు తెలంగాణ సచివాలయానికి స్వయంగా వచ్చి మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా చెక్కులను అందుకున్నారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాలు కష్టాల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లు తమ కుటుంబాల జీవనోపాధి కోసం ప్రతిరోజూ ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అలాంటి కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని స్పష్టం చేశారు.
కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులతో పాటు గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ పాల్గొన్నారు.
