ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా వైఎస్‌ షర్మిల

అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

పీసీసీ అధ్యక్షురాలిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేసిన షర్మిల పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘పీసీసీ అధ్యక్షురాలి పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా. రాష్ట్రంలో పార్టీకి గత వైభవం తీసుకొచ్చేందుకు పెద్దలు, సీనియర్లతో కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎక్స్‌ (ట్విటర్‌)లో షర్మిల పేర్కొన్నారు.

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వెతెపా) స్థాపించిన షర్మిల ఇటీవల కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీని విలీనం చేశారు. ఢిల్లీ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరినప్పుడే ఏపీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏపీ పీసీసీ చీఫ్‌ బాధ్యతలను ఆమెకు కట్టబెట్టింది.