ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో అర్జెంటీనా ఘన విజయం
ఖతార్‌లోని లూసెయిల్ స్టేడియం వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ ఉత్కంఠ పోరులో డిఫెండిగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం సాధించింది. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2తో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలో 80 నిమిషాల పాటు ఏకపక్షంగా సాగింది. అర్జెంటీనా 2 గోల్స్ చేసింది. ఇందులో మెస్సీ తమదైన ఆటతీరుతో మెప్పించాడు. ఫ్రాన్స్ ఒక్క గోల్ కూడా చేయలేదు. కానీ రెండో స్టేజ్‌లో ఫ్రెంచ్ స్టార్ స్ట్రైకర్ కైలియన్ ఎంబాపె రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. 80వ నిమిషంలో తొలి గోల్ పెనాల్టీ షూట్ కాగా, 81వ నిమిషంలో రెండో గోల్ నమోదైంది. ఆ తరువాత 118వ నిమిషంలో ఎంబాపె మూడో గోల్ చేసి స్కోరు సమం చేశాడు. ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్ కొట్టినా ఫ్రాన్స్‌కు నిరాశే ఎదురైంది. పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో ఫ్రాన్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను కోల్పోయింది.
మ్యాచ్ గెలిచిన అర్జెంటీనా జట్టు గ్రౌండ్ అంతా పరిగెడుతుంటే, ఎంబాపే తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. మైదానంలో ఒకచోట కూలబడిపోయాడు. అతడిని ఓదార్చేందుకు, ధైర్యం చెప్పేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్వయంగా మైదానంలోకి వచ్చారు. ఎంబాపేను కౌగలించుకుని, తలను నిమురుతూ చాలాసేపు మాట్లాడారు. ఆ తరువాతే ఎంబాపే లేచి నిలబడ్డాడు. మేక్రాన్ ఎంబాపేను ఓదారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశాధ్యక్షుడు, ఆటగాడిపై చూపించిన అక్కరకు జనం ప్రశంసలు కురిపిస్తున్నారు. మేక్రాన్ మైదానంలోకి రాకముందే, అర్జెంటీనా కీపర్ ఎమిలియానో మార్టినెజ్ ఎంబాపే చేయి పట్టుకుని ఓదార్చడం కనిపించింది.