పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలన్నారు కానీ.. ఇప్పుడు చాలా పెళ్లిళ్లు పుటుక్కుమని పెటాకులవుతున్నాయి. మనసులు కలవని ఆ బంధం ఇట్టే తెగిపోతున్నది. ఒకప్పుడంటే భర్త ఎంతగా హింస పెట్టినా, అతడితో ఎన్ని విభేదాలున్నా అన్ని భరించేది భార్య. భర్తతో విడిపోవడాన్ని తప్పుగా భావించేది. విడాకులు ఇవ్వకపోవడానికి సమాజం పట్ల ఉన్న భయం కూడా కారణం కావచ్చు. ఇప్పుడు రోజులు మారాయి. మెట్టింటి వారు పెట్టే బాధలను ఏ మాత్రం సహించడం లేదు. వెంటనే పెట్టాబేడా సర్దుకుని పుట్టింటికొచ్చేస్తున్నారు. లేదా సొంతంగా తమ కాళ్ల మీద తాము నిల్చుంటున్నారు. విడాకులను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
అమెరికాకు చెందిన ఓ మహిళ ఇలాగే విడాకులను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. నార్త్ కరోలీనాకు చెందిన లారెన్ బ్రూక్ (Lauren Brooke) అనే మహిళ 2012 అక్టోబర్‌లో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. 2021లో విడిపోయారు. అమెరికా చట్టం ప్రకారం విడాకులు తీసుకునే ఓ ఏడాది ముందు వరకూ ఆలుమగలు వేరు వేరుగా ఉండాలి. ఆ తర్వాతే విడాకులకు దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ ముగియడానికి ఏడాది పట్టింది. మొన్న జనవరిలో వీరిద్దరికి విడాకులు మంజూరయ్యాయి. విడాకులు తీసుకున్న శుభదినాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు లారెన్ బ్రూక్. ఎరుపు రంగు గౌను ధరించి అందంగా ముస్తాబయ్యారు. చేతిలో డివోర్స్‌డ్ అనే బ్యానర్‌ను పట్టుకుని ఫోటోలు దిగారు.
తర్వాత వెడ్డింగ్ రోజు ఎంతో ఇష్టంగా తొడుక్కున్న గౌనును మంటల్లో వేసి కాల్చేశారు. తన పెళ్లి ఫోటోను కాలితో తొక్కారు. కొన్ని ఫోటోలను కాల్చి బూడిద చేశారు. కొన్ని ఫోటోలను కాలితో తన్నారు. కొన్నింటిని ముక్కలు చేశారు. తన తల్లి, ఫ్రెండ్స్ సమక్షంలో ఎంతో ఆనందంగా విడాకులను సెలబ్రేట్ చేసుకుంది. ‘విడాకులు తీసుకోవడం ఎంతో కష్టం. చాలా బాధను అనుభవించాను. కొన్నేళ్ల పాటు నరకం అనుభవించాను. ఉదయం నిద్ర లేచి ఏడ్చేదాన్ని. నా జీవితం ఇక్కడితో అంతమవుతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. మా పిల్లల కోసం మాత్రం అప్పుడప్పుడు అతడితో కాసేపు ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏడ్వాల్సిన పని లేదు. చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు.