ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో ‘ మాజీ కేంద్రమంత్రి..కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.