నూతన కార్మిక కోడ్‌ల రాష్ట్ర నిబంధనల ఖరారుకు సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం
యజమానులు, కార్మిక సంఘాలు, ఉద్యోగుల ప్రతినిధుల సూచనలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం
హైదరాబాద్, జూన్ 10:
కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు నూతన కార్మిక కోడ్‌లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనల (State Rules) రూపకల్పన ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత రాష్ట్ర నిబంధనలపై వివిధ వర్గాల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు నాలుగు ప్రత్యేక అధికారుల కమిటీలను ఏర్పాటు చేసింది.
కార్మిక కమిషనర్ వెల్లడించిన వివరాల ప్రకారం, యజమానుల సంఘాలు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, ఉద్యోగుల ప్రతినిధులు మరియు ఇతర వాణిజ్య సంస్థలతో సంప్రదింపుల సమావేశాలు జూన్ 11 నుంచి జూన్ 16, 2026 వరకు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న టీ. అంజయ్య భవన్‌లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి.
సమావేశాల షెడ్యూల్ ప్రకారం జూన్ 11న సోషల్ సెక్యూరిటీ కోడ్–2020, జూన్ 12న కోడ్ ఆన్ వేజెస్–2019, జూన్ 15న ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్–2020, జూన్ 16న ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్–2020లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనలపై చర్చలు జరగనున్నాయి.
ప్రతిపాదిత నిబంధనలపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయదలచిన అన్ని వర్గాల ప్రతినిధులు ఆయా తేదీల్లో నిర్వహించే సమావేశాలకు హాజరై నిర్మాణాత్మక సూచనలు అందించాలని కార్మిక కమిషనర్ కోరారు.
ఈ సంప్రదింపుల ద్వారా కార్మికులు, యజమానులు మరియు ఇతర భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర నిబంధనలను మరింత సమగ్రంగా, ఆచరణాత్మకంగా రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. నూతన కార్మిక కోడ్‌ల అమలుతో కార్మిక సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగ సంబంధాల బలోపేతానికి అవసరమైన సమతుల్యత సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
