స్మార్ట్‌ఫోన్లలో ఆధార్ యాప్ ఇన్‌బిల్ట్‌పై వివాదం.. కేంద్రానికి కంపెనీల ‘నో’
పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు ఉన్నప్పటికీ, ఒక వ్యక్తికి ప్రధాన గుర్తింపు కార్డు అంటే అది ఆధార్ కార్డు. దేశంలో సుమారు 134 కోట్ల ఎన్‌రోల్‌మెంట్స్‌తో ఇది అత్యంత కీలక బయోమెట్రిక్ ఐడీగా మారింది. దాదాపు ప్రతి సేవకు ఆధార్ తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో, యూజర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ క్రమంలో ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్‌ను ముందుగానే (ఇన్‌బిల్ట్‌గా) ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలని కేంద్రం సూచించింది. అయితే ఈ ప్రతిపాదనను Apple, Samsung, Google వంటి ప్రముఖ టెక్ కంపెనీలు తిరస్కరించాయి. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇదే తరహాలో ఇటీవల సంచార్ సాథీ యాప్‌ను కూడా ఫోన్లలో ఇన్‌బిల్ట్‌గా ఇవ్వాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని కంపెనీలు అంగీకరించలేదు. ఇప్పుడు ఆధార్ యాప్ విషయంలో కూడా అదే ధోరణిని కొనసాగించాయి.
రాయిటర్స్ నివేదిక ప్రకారం, 2026 జనవరిలో కేంద్రం ఈ ప్రతిపాదనను కంపెనీల ముందు ఉంచింది. భారతదేశంలో అమ్మే ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో బయోమెట్రిక్ ఐడెంటిటీ సపోర్ట్ ఉండి, యూజర్ కొత్త ఫోన్ కొనుగోలు చేసిన వెంటనే ఆధార్ ఆటోమేటిక్‌గా లింక్ అయ్యే విధంగా యాప్‌ను రూపొందించాలని సూచించింది.
కంపెనీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
MAIT (మ్యానిఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా స్పందించింది. ఈ విధానం అమలు చేస్తే ప్రైవసీ, డేటా భద్రత సమస్యలు తలెత్తే అవకాశముందని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. యాప్‌ను ప్రీ–ఇన్‌స్టాల్ చేయాలంటే ప్రత్యేక ఉత్పత్తి ప్రక్రియ అవసరమవుతుందని, ఎగుమతుల విషయంలో కూడా లాజిస్టిక్ ఇబ్బందులు తలెత్తవచ్చని పేర్కొన్నాయి.
ఇది వినియోగదారులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చదని MAIT జనవరి 13న కేంద్రానికి పంపిన మెయిల్‌లో వెల్లడించింది.
కేంద్రం ఉద్దేశం ఏమిటి?
UIDAI అభివృద్ధి చేసిన ఆధార్ యాప్ ద్వారా యూజర్లు తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం, ఫ్యామిలీ ప్రొఫైల్ నిర్వహించడం, బయోమెట్రిక్ లాక్ వంటి భద్రతా ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. యాప్ ముందుగానే ఫోన్‌లో ఉంటే, ప్రత్యేకంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సేవలు సులభంగా పొందవచ్చని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం బ్యాంకింగ్, టెలికాం, ఎయిర్‌పోర్ట్ సేవలు సహా అనేక రంగాల్లో ఆధార్ కీలకంగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ యాప్‌లను స్మార్ట్‌ఫోన్లలో ప్రీ–ఇన్‌స్టాల్ చేయడం సాధారణం కాదని, Russia మినహా ఇతర దేశాల్లో ఇలాంటి విధానం లేదని కంపెనీలు వాదిస్తున్నాయి.
మొత్తంగా, సౌలభ్యం వర్సెస్ ప్రైవసీ మధ్య ఈ వివాదం మరింత చర్చకు దారితీస్తోంది.
