సిద్దిపేటలో 1,121 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ
పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రానున్న రెండేళ్లలో మరో 2 లక్షల ఇళ్ల మంజూరు
సిద్దిపేట, నవంబర్ 10: పేదల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలు, మున్సిపాలిటీకి చెందిన 1,121 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ కె. హైమావతి కలిసి పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కొండ భూదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపాలిటీ, సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నారాయణరావుపేట, నంగునూరు మండలాలకు చెందిన 1,121 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా ఒక్కో కుటుంబానికి నెలకు సుమారు రూ.1,200 వరకు ఆదా అవుతోందని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు ఈ పథకం కింద ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.9 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. మహిళలు ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుని కుటుంబ అవసరాలు, పిల్లల చదువులకు వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. వైద్య చికిత్సల కోసం ఎల్ఓసీలతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.3 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లు వివరించారు.
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 5,500 ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించగా, రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. రానున్న రెండేళ్లలో మరో రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసి పేదలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజన సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, సంక్షేమ రంగాల్లో ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
నీటి పొదుపుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశాలున్నందున రానున్న వేసవిలో తాగునీటి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. ఇప్పటి నుంచే అప్రమత్తంగా లేకపోతే మే, జూన్ నెలల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సిద్దిపేట పట్టణంలో అమృత్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించిన విధంగానే, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి సమస్యను ఎదుర్కోవడంలోనూ సహకరించాలని కోరారు.
సిద్దిపేట జిల్లాలో కొత్తగా 15 వేల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా అదనంగా 45 వేల మందికి ప్రయోజనం చేకూరిందని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం, పూజల గోపికృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
