Hyderabad Press Club Elections

అవ‌క‌త‌వ‌క‌ల ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లు రద్దు చేయండి: తిరుమ‌ల‌గిరి సురేంద‌ర్, ప్రెస్ అకాడ‌మీ పూర్వ చైర్మ‌న్

సేవా బావానికీ, పాత్రికేయులు, వారి కుటుంబాల‌కు ఉప‌యోగ‌క‌ర‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల్సిన ప్రెస్‌క్లబ్ అవినీతికీ, మ‌ద్య‌పానానికీ, కుళ్లు రాజ‌కీయాల‌కు వేదిక‌గా మారిందని, రెండు ద‌శాబ్ధాలుగా ప్రెస్ క్ల‌బ్ ఎన్నికలు ప్రహసనంగా మారిపోయాయని, ప్రెస్ అకాడ‌మీ పూర్వ చైర్మ‌న్ తిరుమ‌ల‌గిరి సురేంద‌ర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో దౌర్జన్యకాండ చోటు చేసుకోవడం అనేది క్లబ్ రాజకీయాల పతనావస్థకు పరాకాష్టగా భావించవచ్చని, ప్రెస్‌క్లబ్ ఎన్నికల్లోగ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అభ్యర్థులు ఎగబడటం, ప్ర‌చార ఖ‌ర్చులు చూస్తుంటే వెనకాల ఏదో మతలబు ఉందా? అనే అనుమానాలు కలగడం ఒక ఎత్తయితే, ఏ ర‌కంగానూ ప్రెస్ క్ల‌బ్ ఉన్న‌తికి పాటుప‌డ‌ని యూనియ‌న్లు, పత్రికా సంస్థలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మరో ఎత్తని సురేందర్ తెలిపారు.

“ఇదంతా దేనికి అనే సందేహం కలుగక మానదు. లేకపోతే పత్రికల ఎడిటర్లు, బ్యూరో చీఫులు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు, వచ్చి ఎన్నికల రోజు గేటు దగ్గర నిలబడి ఓట్లు వేయించడం దేనికి సంకేతమో అర్థం కావడం లేదు. రెండు ప్రధాన పత్రికలు ఈ ఎన్నికలలో తమ వారు తప్పనిసరిగా గెలవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తున్నది, దీనిని ఎలా తీసుకోవాలో వస్తుంది అర్థం కావడం లేదు. పొరుగు రాష్ట్రంలో క్యాబినెట్ హోదాతో పనిచేస్తున్న ఒక సీనియర్ పాత్రికేయుడు వచ్చి నిలబడి తన అభ్యర్థులను గెలిపించుకోవాలని పట్టుదలతో ర్యాంపు మీద తిరగడం మరో వైచిత్రి” అని అన్నారు.

ఇవన్నీ చూసేవారికి చాలా ఎబ్బెట్టుగానూ, వింతగానూ, కొండొకచో వికృతంగానూ కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో చెల్ల‌ని ఓట్ల పై అభ్యంత‌రాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, దుండగులు బ్యాలెట్ బాక్స్ ఎత్తుకొని పోవడం, అందులో నీళ్లు పోసి తీసుకువచ్చి అప్పగించడం, లెక్కింపు పూర్తయినా ఫలితాలు ప్రకటించగలిగే పరిస్థితి ఎన్నికల అధికారులకు లేకపోవడం చూస్తుంటే అసలు ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఎందుకు జరుగుతాయి, దానివల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే ప్రశ్నలు పదేపదే తలెత్తుతాయని, సురేందర్ అన్నారు. పైగా కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఆధిపత్యపోరు సాగడం ప్రెస్‌క్లబ్ కు ఏరకంగా సరిపడుతుందని,

విజ్ఞత గల సభ్యులు నిస్సహాయంగా చూస్తూ భరిస్తున్నారు. దీనిపై సహకార చట్టం కింద విచారణ జరిపించి, లోపలి వ్యవాహారాలపై లోతైన దర్యాప్తు కూడా జరిపిస్తే కొంతయినా స్పష్టత వస్తుందేమోనని, అన్నారు. అవినీతి, కుళ్లు రాజ‌కీయాల‌కూ, కులాల కుట్ర‌ల‌కూ ఆల‌వాల‌మైన ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని సీనియ‌ర్ పాత్రికేయులు డిమాండ్ చేస్తున్నారని సురేందర్ తెలిపారు.