ఆర్టీసీ జేఏసీ బంద్ ప్రభావం: బస్సులు డిపోలకే పరిమితం – మెట్రో స్టేషన్లలో రద్దీ పెరుగుదల
హైదరాబాద్, ఏప్రిల్ 22:
ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్‌తో నగరంలో బస్సు సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బుధవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన సమ్మె ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్ సిటీ బస్సులతో పాటు జిల్లాలకు వెళ్లే సర్వీసులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
దీనితో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్), దిల్సుఖ్నగర్ వంటి ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు.
దీని ఫలితంగా మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దిల్సుఖ్నగర్, లక్డీకాపూల్, సికింద్రాబాద్, జేబీఎస్, అమీర్‌పేట్, మాదాపూర్ వంటి మెట్రో స్టేషన్లు తీవ్ర రద్దీని ఎదుర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మికుల సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, సర్కార్ ఉద్యోగులకు సమానంగా పీఆర్సీ, తదితర ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు. ఈ సమ్మె కారణంగా బస్ డిపోలలో వందల సంఖ్యలో బస్సులు నిలిచిపోయాయి.
నడవ ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవుల కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అద్దెలను నడిపే ప్రయత్నాలు జరుగుతుండగా, నగరంలో పోలీస్ బందోబస్తుతో కొంతమేర బస్సులను డిపోల నుంచి బయటకు పంపుతున్నారు. అయితే రోడ్లపై వచ్చిన బస్సులను సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది.
