కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు – అందుకే బీఆర్ఎస్ సమావేశానికి కవిత దూరం

కవిత ఎదుగుదలను అడ్డుకున్నది ఎవరు?

డిల్లీ స్థాయిలో అన్ని పార్టీల్లో పరిచయాలు ఉన్న కవిత ను కెసిఆర్ కు దూరం చేస్తున్నది ఎవరు?

జాతీయ మీడియా సంచలన కథనం

సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి తన మానస పుత్రిక అయినటువంటి టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన వేళా కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు రేగినట్లు జాతీయ మీడియా న్యూస్ 18 సంచలన కథనాన్ని రాసింది. అందులో భాగంగానే కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఆ కార్యక్రమానికి గైర్హాజరు అయినట్లు ఆ మీడియా కథనం వెల్లడించింది.

దసరా నాడు టీఆర్ఎస్ లాంఛనంగా బీఆర్ఎస్ కి మారడానికి వేదికైన తెలంగాణ భవన్ లో సీఎం కెసీఆర్ తో కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వేదిక పంచుకున్నారు. కానీ కవిత మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కార్యక్రమం ప్రారంభమయ్యే కొద్ది గంటల ముందు సీఎం కేసీఆర్ తో దాదాపు పది నిమిషాల పాటు కవిత ఫోన్లో మాట్లాడినట్లు న్యూస్ 18 వెల్లడించింది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొంది. అయితే సీఎంతో మాట్లాడిన తర్వాత తెలంగాణ భవన్ కి ఆమె రాకుండా ఇంటికి పరిమితమై ఉండడానికి గల కారణాలు ఏమిటో ఎవరికి అంతు పట్టడం లేదు.

ప్రగతి భవన్ లో జరిగిన దసరా పూజలో కుటుంబ సభ్యులు, ఇతర బంధువులంతా పాల్గొన్నా కవిత మాత్రం రాకపోవడం తెరాస వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ స్థాపన సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో కనీసం స్వాగతిస్తూ స్పందించలేదు. ఈ పరిణామాలు టీఆరెఎస్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మంచి మాటకారి అయినా కవిత ఎంపీగా 2019 వరకు ఢిల్లీ రాజకీయాల్లో చాలా చురుగ్గా వ్యవహరించేవారు. స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రే, దేవే గౌడ, శరద్ పవార్ వంటి నేతలను కెసిఆర్ కలిసినపుడు కవితని వెంటపెట్టుకొని వెళ్ళారు. కానీ చివరకు కవిత ఇప్పుడు ఎందుకు దూరంగా ఉన్నారు అన్నది చర్చనీయాంశం అయింది.

మునుగోడు ఉప ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు తో సహా 86 మంది నేతలకు బాధ్యతలు అప్పగించిన కెసిఆర్ కవితకు మాత్రం స్థానం కల్పించలేదు. గ్రామీణ ప్రాంత మహిళల్లో ఎంతో ఆధరణ ఉన్న కవితని కెసిఆర్ ఉప ఎన్నికలకు ఎందుకు దూరం పెట్టారు.?ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత పాత్ర పై ఈడీ ఎటువంటి దర్యాప్తు జరపకపోయినా బీజేపి పదేపదే ఆమె పేరును లాగుతోంది. అయినా కూడా కెసిఆర్ , కేటీఆర్ సహా పెద్ద నాయకులు ఎవ్వరూ బిజెపి ప్రచారాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. పార్టీ తరఫున అధికారికంగా ఎవరూ స్పందించలేదు. కనీసం అండగా నిలువలేదు. ఇలా కవితని ఒంటరి చేయడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అని వెల్లడించింది