15 ఏండ్ల తర్వాత ఈఎస్ఐలో భారీ నియామకాలు
247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసిన మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
త్వరలో మరో 300కుపైగా వైద్య, పారామెడికల్ పోస్టుల భర్తీ
హైదరాబాద్, జూలై 17: రాష్ట్రంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో దాదాపు 15 ఏండ్ల తర్వాత తెలంగాణ ఉద్యోగుల రాష్ట్ర బీమా (ఈఎస్ఐ) శాఖలో భారీ స్థాయిలో నియామకాలు చేపట్టామని రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ద్వారా ఎంపికైన 247 మంది స్టాఫ్ నర్సులకు శుక్రవారం కొమురం భీం ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, 2011 తర్వాత ఈఎస్ఐ శాఖలో ఇదే తొలి భారీ ప్రత్యక్ష నియామక ప్రక్రియ అని పేర్కొన్నారు. కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నర్సింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని, అందుకే సిబ్బంది కొరతను పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది బీమా పొందిన కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో కలిపి దాదాపు 75 లక్షల మంది లబ్ధిదారులకు ఈఎస్ఐ వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవల కోసం వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, మందులు, ఆధునిక వైద్య పరికరాలు సమృద్ధిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్న మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో ఈఎస్ఐ ఆస్పత్రులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని తెలిపారు. సుమారు రూ.72 కోట్ల బకాయిలను విడుదల చేసి, మందుల కొరతను నివారించడంతో పాటు నిర్వహణ, సేవల మెరుగుదలకు అదనపు నిధులు కేటాయించామని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కూడా ఈ అంశాలపై చర్చించినట్లు తెలిపారు.
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిపై ఉన్న భారాన్ని తగ్గించేందుకు రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్, కార్డియాక్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అలాగే నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలను బలోపేతం చేసి కార్డియాక్ సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీంతో కార్మికులకు తమ ప్రాంతానికే ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా రామగుండం, శంషాబాద్, మహబూబ్‌నగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే 12 నుంచి 18 నెలల్లో రాష్ట్రంలోని అన్ని ఈఎస్ఐ ఆస్పత్రులను దశలవారీగా ఆధునికీకరిస్తామని వెల్లడించారు.
ఈఎస్ఐ శాఖలో మొత్తం 599 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా ఈరోజు 247 మంది స్టాఫ్ నర్సులను నియమించామని, త్వరలోనే 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 6 మంది డెంటల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్‌ఎంలు సహా ఇతర పారామెడికల్ సిబ్బంది నియామకాలు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈఎస్ఐ సేవల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అదేవిధంగా నాచారం ఈఎస్ఐలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో నర్సింగ్ విద్యను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
కొత్తగా నియామకమైన నర్సులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగాన్ని కేవలం ఉపాధిగా కాకుండా సేవా ధర్మంగా భావించి పనిచేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ సిబ్బందికి భారీ డిమాండ్ ఉందని, ముఖ్యంగా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టామ్‌కామ్ ద్వారా విదేశీ భాషల్లో శిక్షణ అందించి అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని వివరించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, 15 ఏండ్ల తర్వాత ఒకేసారి 247 మంది స్టాఫ్ నర్సులను నియమించడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. గత పదేళ్లలో ఈఎస్ఐ శాఖ ద్వారా కార్మికులకు అందాల్సిన సేవలు అందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని ఈఎస్ఐ ఆస్పత్రుల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు, అవసరమైన సంస్కరణలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, వాటిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దశలవారీగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించిందన్నారు.
ఈరోజు 247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించడం ఆ ప్రక్రియలో తొలి కీలక అడుగని పేర్కొన్న భట్టి విక్రమార్క, త్వరలోనే వైద్యులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు తదితర పోస్టుల భర్తీ పూర్తి చేసి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
అలాగే బీఆర్ఎస్ పాలనలో పదేళ్లపాటు కార్మిక శాఖను, కార్మికులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన ఆయన, మంత్రి వివేక్ వెంకటస్వామి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తున్నారని అన్నారు. కార్మికుల వేతన సవరణను అమలు చేయించి కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, ఐఏఎస్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గంగాధర్, ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ క్రాంతి సాగర్తో పాటు ఈఎస్ఐ, కార్మిక శాఖకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
