2023 జనవరి 7 లోపు రైతుబంధు కొరకు నూతన దరఖాస్తులు ఆహ్వానం – వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి
07 జనవరి 2023 లోపు రైతు బంధు కొరకు నూతనంగా పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం పూర్తయిన రైతులు, గిరిజన శాఖ ద్వారా పట్టాలు పొందిన రైతులు రైతు బంధు కొరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి నేడోక ప్రకటనలో తెలిపారు. యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు బంధు సహాయం 2022 డిసెంబర్ 28 నుంచి పంపిణీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, *20 డిసెంబర్ 2022 కటాఫ్ తేదీగా నిర్ణయించి అప్పటి వరకు పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు, ధరణి లో డిజిటల్ సంతకం పూర్తయిన రైతులు, గిరిజన శాఖ ద్వారా పట్టాలు పోందిన రైతులకు సైతం రైతు బంధు పెట్టుబడి సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు.
పెద్దపల్లి జిల్లాలో యాసంగి సీజన్ కోసం ఇప్పటి వరకు 1,50,460 రైతులకు 138 కోట్ల 52 లక్షల 88 వేల 81 రూపాయలు రైతుబంధు సహాయం కింద ఎంపిక చేసామని, గత వానాకాలం సమయంలో 1,41,265 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించామని, ప్రస్తుత సీజన్ లో 4360 మంది కొత్త పట్టాదారులకు అదనంగా సహయం అందిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 20, 2022 నాటికి ధరణి, గిరిజన శాఖలో పట్టాదారులైన రైతులు రైతుబంధు పొందడానికి తమ భూమి పట్టా, బ్యాంకు వివరాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందించాలని ఆయన కోరారు. గత పంట కాలంలో రైతుబంధు జమ చేయబడిన రైతులు వారి బ్యాంకు ఖాతాలను ఏ కారణాల చేతనైన మార్చుకోవాలి అనుకుంటే సదరు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం యొక్క ప్రతులతో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని 07, జనవరి 2022 లోపల సంప్రదించాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.