Partition Pains

విభజన విషాద సంస్మరణ దినం సందర్భంగా కన్నాట్ ప్లేస్ లో మౌన ప్రదర్శన

హాజరైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖి

న్యూఢిల్లీ: దేశ విభజన రేకెత్తించిన గాయాలను స్మరించుకుంటూనే దేశ సమగ్రత, ఐకమత్యం కోసం పనిచేయాలన్న స్ఫూర్తిని దేశ యువతలో రెకెత్తించేందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని ఇన్నర్ సర్కిల్ లో మౌన ప్రదర్శన నిర్వహించారు. విభజన విషాద సంస్మరణ దినం సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ మౌన ప్రదర్శనలో జి.కిషన్ రెడ్డితోపాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మీనాక్షి లేఖితోపాటు పెద్ద సంఖ్యలో యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దేశ విభజన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మంత్రులు నివాళులు అర్పించారు.

దేశ విభజన భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని, ఆ సమయంలో సరిహద్దులు దాటి భారతదేశానికి వచ్చే ప్రయత్నంలో జరిగిన మతకలహాల్లో ఎందరోమంది ప్రాణత్యాగాలు చేశారని కిషన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. వారందరికీ నివాళులు అర్పించిన ఆయన, ఎన్నో సమస్యలు ఎదుర్కొని ధైర్యంగా ప్రాణాలతో బయటపడిన వారందరినీ అభినందించారు.

అనంతరం, ఐజీఎన్‌సీఏ ఆధ్వర్యంలో జైపూర్ హౌజ్ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎమ్ఏ)లో ఏర్పాటుచేసిన విభజన కాలం నాటి దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే ఎగ్జిబిషన్ ను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.