Peddapalli: Police Counselling

అసాంఘీక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదు: ఏసీపీ సారంగపాణి

అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రైస్‌మిల్లుల్లో పోలీస్‌ అధికారులు, సిబ్బందితో కలిసి ఐదు బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైస్‌మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో గంజాయి సాగు చేసినా, గంజాయి మొక్కలు పెంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు రైస్‌మిల్లుల్లో పని చేస్తున్నారని, వారి పూర్తి సమాచారం రైస్‌ మిల్‌ యజమాని వద్ద ఉండాలని సూచించారు. రైస్ మిల్ చుట్టూ, పరిసరాల్లో నిరంతరం పరిశీలించాలని, తమ పరిధిలో ఎక్కడైనా గంజాయి మొక్కలు లాంటివి పెరిగినా తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేశారు. కార్మికులు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రతి మిల్లు యజమాని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని, పండ్ల మొక్కలు, పూల మొక్కలను పెంచాలన్నారు. గంజాయి మొక్కలను పెంచితే యజమానులపై కేసులతో పాటు పీడీయాక్టుకు కూడా వెనకాడబోమని తెలిపారు. అనంతరం మిల్లు యాజమాన్యం, రైస్‌ మిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు చీటీ- కేశవరావు, జిల్లా అధ్యక్షులు ఎడవెల్లి రాంరెడ్డిలతో పాటు పలువురు యజమానులతో చర్చించారు. ఈ తనిఖీలలో సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐ,ఉపేందర్‌రావు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు..