ఏప్రిల్ నాటికి రామగుండంలో వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఏప్రిల్ నాటికి రామగుండంలో వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రామగుండం లోని వైద్య కళాశాల నిర్మాణ పనులను మంత్రి మంగళవారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు చేపట్టారని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.10 వేల కోట్లను వైద్య శాఖకు ప్రత్యేకంగా కేటాయించి అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ చేపడుతున్నారని మంత్రి తెలిపారు.
వైద్య కళాశాల నిర్మాణానికి 200 కోట్లు, అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి 300 కోట్లు మొత్తం 500 కోట్ల చొప్పున రూ.4వేల కోట్లతో 8 నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అందులో రామగుండం ప్రాంతంలో నూతన వైద్య కళాశాలలో సీఎం కేసీఆర్ మంజూరు చేశారని, రామగుండం ప్రాంతంలో పనులు ఆలస్యంగా ప్రారంభం అయ్యాయని, మిగిలిన కళాశాల తో సమానంగా రాబోయె విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించే విధంగా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మొదటి సంవత్సర తరగతుల నిర్వహణకు అవసరమైన 70 వేల చదరపు అడుగుల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, ఏప్రిల్ మాసంలో జాతీయ మెడికల్ కౌన్సిల్ పరిశీలన ఉంటుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ నాటికి మొదటి సంవత్సర తరగతి నిర్వహణకు అవసరమైన భవన నిర్మాణం, గ్రంథాలయం, ల్యాబ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రామగుండం ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే, జెడ్పి చైర్ పర్సన్ ప్రజాప్రతినిధులు స్వయంగా పరిశీలించాలని, అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 4 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారని మంత్రి తెలిపారు. వరంగల్ పట్టణంలో 1100 కోట్లతో 24 అంతస్తుల్లో భారీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నామని, టెండర్ ప్రక్రియ సైతం పూర్తవుతుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, టిమ్స్ ఆస్పత్రులకు అదనంగా 3 స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. 3500 కోట్లతో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని, 550 కోట్లతో 14 నర్సింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రామగుండం లో సైతం నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ పుట్టమధు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.