పేదలకు వైద్యంతో పాటు మెడిసిన్ ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి జనఔషధీ పథకం లక్ష్యం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
వారాసిగూడా లో పీఎం జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: సామాన్యులకు వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి భారతీయ జనఔషధీ పథకం లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారాసిగూడా లో పీఎం జన ఔషధి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. మారిన జీవన విధానం తో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తమ సంపాదనలో 40శాతాన్ని ఖర్చు చేసుకుంటున్న పేదలు, వెనుకబడిన వర్గాలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకు అందించి వారిని ఆదుకోవడమే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
2017లో 3వేల జనఔషధి కేంద్రాలు ఉండగా.. మార్చి 2020 నాటికి ఈ సంఖ్య 6 వేలకు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 9వేల పై చిలుకు జన ఔషధి కేంద్రాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి అన్నారు. సాధారణ మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే జనఔషధి కేంద్రాల్లో మందులు 50-90 శాతం తక్కువ ధరకే లభిస్తాయన్నారు. తక్కువ ధరకే ఇస్తున్నా.. మందుల నాణ్యత విషయంలో రాజీ పడటం లేదని కేంద్రమంత్రి తెలిపారు. గత 8 ఏళ్లలో జన ఔషధి కేంద్రాలు, వీటి ద్వారా జరుగుతున్న ఔషధాల అమ్మకాల్లో గణనీయమైన మార్పు కనబడుతోందన్నారు కిషన్ రెడ్డి అన్నారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు.