₹40 నుండి 62 లక్షల ‘ఉచిత ప్రమాద బీమా సౌకర్యం’ కోసం బ్యాంకు అకౌంట్లను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ గా మార్చుకోండి: డైరెక్టర్ ఫైనాన్స్ బలరామ్ పిలుపు
సింగరేణిలో పనిచేసే కార్మికులు, అధికారులందరూ తమ బ్యాంకు అకౌంట్లను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ గా వెంటనే మార్చుకోవాలని, తద్వారా 40 నుండి 62 లక్షల ‘ప్రమాద బీమా స్కీమ్’ ప్రయోజనాలు పొందవచ్చని సంస్థ డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరామ్ తెలిపారు. ఈ స్కీమ్ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ తమ వద్ద పనిచేసే కార్మికులకు, అధికారులకు నెలవారి జీతాలను ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’, ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ తదితర బ్యాంకుల ద్వారా చెల్లిస్తోందని, సింగరేణి వ్యాప్తంగా మొత్తం 44వేల మంది ఉద్యోగులకు వారి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. ఇవీ నెలకు సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఉంటాయన్నారు. కాగా, బ్యాంకు ఖాతాలు ఉన్న అధికారులకు, కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో బ్యాంకుల ఉన్నతస్థాయి అధికారులతో తాము చర్చించి, ఉచితంగా ‘ప్రమాద బీమా స్కీమ్’ ను అమలు కోసం ఒప్పించడం జరిగిందని, ఇది గత ఏడాది కాలంగా అమలులోకి వచ్చిందన్నారు. ఈ స్కీమ్కు అర్హత సాధించాలంటే సేవింగ్స్ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికుడు, అధికారి తమ అకౌంట్లను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ గా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు.
సింగరేణి మొత్తం మీద ఉద్యోగులు, అధికారులకు సంబంధించి 44వేల బ్యాంక్ అకౌంట్లు ఉండగా, వీటిలో ఇప్పటికే సుమారు 30వేల మంది అకౌంట్లను బ్యాంకుల వారు ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ ఖాతాలుగా మార్చడం జరిగిందన్నారు. కార్పోరేట్ శాలరీ అకౌంట్గా మార్చుకున్న అందరికి బ్యాంకుల ద్వారా అమలులో ఉన్న ‘యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీము’ వర్తిస్తుందన్నారు. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వారి పథకం ప్రకారం 40 నుండి 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ వారి పథకం ప్రకారం 40 నుండి 62 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందన్నారు. అలాగే ‘కెనరా బ్యాంకు’, ‘ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్’ ఇతర బ్యాంకుల నుండి కూడా వారివారి ఇన్సూరెన్స్ పథకాలు వర్తిస్తాయన్నారు. అయితే, ఇంకా తమ ఖాతాలను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ గా మార్చుకోని వారికి మాత్రం ఇది వర్తించదు అని పేర్కొన్నారు.
కాబట్టి ప్రతి ఉద్యోగి తమ బ్యాంకు అకౌంట్ ను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ గా తక్షణమే మార్చుకోవాలని, తద్వారా ఇన్సూరెన్స్ పథకాల వర్తింపు కు అర్హత పొందాలని సూచించారు. గత రెండేళ్ల కాలంగా ప్రమాదాల వలన మృతి చెందిన ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ కలిగిన ఉద్యోగులకు 40 నుండి 62 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సొమ్మును బ్యాంకులు అందజేశాయని గుర్తు చేశారు. అలాగే ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ లేని, ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు ఈ పథకం వర్తించలేదని వివరించారు. ప్రతి ఉద్యోగి, అధికారి రక్షణతో, ఆయురారోగ్యాలతో జీవించాలని యాజమాన్యం కోరుకుంటోందని అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాలు వల్ల ప్రాణ నష్టం జరిగినప్పుడు ఉచితంగా అందిస్తున్న ఇన్సూరెన్స్ పథకం వర్తించడం కోసం ప్రతి ఒక్కరూ తమ బ్యాంకు అకౌంట్లను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’గా మార్చుకోవడం తమ కుటుంబ సభ్యుల సంక్షేమం దృష్ట్యా, ఒక బాధ్యతగా భావించాలన్నారు. తమ జీతం పొందుతున్న బ్యాంకుకు వెళ్ళి తమ అకౌంట్ ను ‘కార్పోరేట్ శాలరీ అకౌంట్’ గా మార్చమని ఒక దరఖాస్తు ఇస్తే సరిపోతుందని, బ్యాంకు వాళ్లు తక్షణమే మారుస్తారని వివరించారు. ఇంతే కాక కార్పోరేట్ శాలరీ అకౌంటుగా మార్చుకోవడం వల్ల మరికొన్ని సౌకర్యాలు, రాయితీలు కూడా ఉన్నాయన్నారు. జీరో బ్యాలెన్స్ సౌకర్యం, ఇంటి రుణం, వాహన రుణం, పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఫీజులో రాయితీలు ఉంటాయి. ఉచిత చెక్కు బుక్కు, తత్కాలిక ఓవర్ డ్రాఫ్టు, లాకర్స్ ఛార్జీలలో రాయితీలు, విదేశీ విద్య రుణంలో రాయితీ తదితర అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే ఏరియాలోని ఏటీబీ సెల్ వారిని సంప్రదించి, సహాయం పొందవచ్చు అని సూచించారు.-