Raidandi: Drinking Water plant need of the hour

ఇగనైనా “రాయదండి” గ్రామంలో తాగునీటి కష్టాలు గట్టెక్కేనా…?

పాములు, పిల్లులు, కోతులు, బల్లులు, పడ్డ నీళ్లే తాగుతున్న ప్రజలు

వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలి.

రామగుండం కార్పొరేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న రాయదండి గ్రామంలో తాగునీటి కోసం అష్టకష్టాలు అనుభవిస్తున్న గ్రామ ప్రజలు. గ్రామంలో మంచి నీటిని అందించేందుకు పాలకులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో గ్రామస్తులు తరచు అనారోగ్యం బారిన పడుతు ఆసుపత్రుల పాలు అవుతున్నారు.

రాయదండి గ్రామానికి చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది, ఇంత విశిష్టత గల గ్రామం పాలకుల నిర్లక్ష్యం కారణంగా కనీసం తాగునీటికి కూడా నోచుకోవడం లేదు. గ్రామంలో 99% మంది ప్రజలు తాగునీటి అవసరాల కోసం గ్రామ పంచాయతీ సంబంధించిన బావిని వినిగిస్తున్నారు. ఆ బావి నిర్వహణ లోపం, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో.. ఇటీవల కొంగను తినే క్రమంలో పాము, కొంగ ఆ తాగునీటి బావిలో పడి చనిపోయి, కుల్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. ఇలా గతంలో చాలా సార్లు కోతులు, కప్పలు, పాములు, బల్లులు, పిల్లులు ఇలా అనేక జంతువులు పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా పడినప్పుడు కాస్త హడావిడి, హంగామా చేసి క్లీన్ చేసినట్లు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు, రాయదండి గ్రామ పాలకులు.

ఇటీవల 800 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర కలిగిన రాయదండి శివాలయం పరిసర ప్రాంతం మలవిసర్జనకు నిలయంగా మారింది అని “అపరిశుభ్రతకు నిలయంగా రాయదండి గ్రామం” అనే శీర్షికన ప్రముఖ ఆన్లైన్ పత్రికలో ప్రచురితమైoది. ఐనప్పటికీ “పాలకుల మీద వర్షం పడ్డట్లే” అన్న చందంగానే ఉంది పరిస్థితి. గ్రామానికి ప్రతీ ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎమ్మెల్యే, ఎం పి లాడ్స్ ఇంకా ఇతర మార్గాల ద్వారా నిధులు వస్తున్నాయి. వాటితో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలి.

గ్రామ ప్రజలు తాగునీటి కష్టాలు తీరాలి అంటే స్థానిక ఎమ్మెల్యే, పాలకులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయాలి. జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగానైనా ఈరోజు గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలి.

కునారపు రమేష్ (KR)

రాయదండి గ్రామ నివాసి