కారు ఆటోను ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలు
కారులో ఆర్టీసి ఎండీ సజ్జనార్
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు, ఆటోను ఢీకొట్టిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద కొద్ది సేపటి క్రితం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు స్వల్ప గాయాలయ్యాయి. సజ్జనార్ మహారాష్ట్రకు వెళుతుండగా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి అడ్డంగా రావడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో రామగుండం మండలం మల్యాల పల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మి లకు తీవ్ర గాయాలు కాగా అంతర్గాం మండలం రాయదండి గ్రామానికి చెందిన నూనె భూమయ్య, నూనె లక్ష్మిలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది.