హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్లు స్తంభనం… సర్వర్ డౌన్‌తో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ సమస్య కారణంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్, చలాన్ చెల్లింపులు, భూ బదలాయింపు రిజిస్ట్రేషన్లు ఎక్కడా సాగలేదు.
ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ, థంబ్ ఇంప్రెషన్ వెరిఫికేషన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యల వల్లే ఈ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఉదయం కార్యాలయాలు ప్రారంభమైన వెంటనే సమస్య మొదలైందని చెబుతున్నారు.
స్లాట్ బుక్ చేసుకున్న క్రయ, విక్రయదారులు గంటల తరబడి కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. చాలామంది మధ్యాహ్నం వరకు ఎదురు చూసి నిరాశతో వెనుదిరిగారు. ముఖ్యంగా ఉద్యోగాలు, ఇతర పనులు వదిలి వచ్చిన వారికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
ఇక, పలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు మరింత కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం త్వరగా సర్వర్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
