హమాలీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా చర్యలు: మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జూన్ 16: రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. హమాలీల సమస్యలు, సంక్షేమ అవసరాలపై సమగ్ర అధ్యయనం చేసి, నిపుణులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కూడిన ప్రత్యేక కమిటీని తక్షణమే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “తెలంగాణ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు – సాధన సమావేశం”లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో హమాలీల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. “హమాలీలు కష్టపడి పనిచేస్తేనే మార్కెట్లు, గోదాములు, రవాణా వ్యవస్థలు సజావుగా సాగుతాయి. కార్మికులు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది” అని పేర్కొన్నారు.
హమాలీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశంపై అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, బీమా, ఇతర ప్రయోజనాలపై కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను హమాలీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. త్వరలోనే ఇందిరా జీవన్ భీమా పథకం కింద అర్హులైన కార్మిక కుటుంబాలకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.
అర్హులైన ప్రతి హమాలీ కార్మిక కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, పేదలు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, కార్మికులు వాటిని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని అన్నారు.
ఈ సందర్భంగా శాసన మండలి సభ్యుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, హమాలీలు రెక్కల కష్టంతో జీవనం సాగించే కార్మికులని పేర్కొన్నారు. వారికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత, బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
