శవాన్ని త్రవ్వి బ్యాంకుకు తీసుకెళ్లిన గిరిజనుడు – ఒడిశాలో కలకలం
కియోంజర్ (ఒడిశా), ఏప్రిల్ 28:
ఒడిశా రాష్ట్రంలోని Keonjhar district జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనలు తెలియని ఓ గిరిజన వ్యక్తి తన సోదరి మరణానికి ఆధారాలు చూపించాలనే ఉద్దేశంతో ఏకంగా ఆమె శవాన్ని త్రవ్వి బ్యాంకుకు తీసుకెళ్లిన సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
డియానాలీ గ్రామానికి చెందిన జితు ముండా (50) అనే గిరిజనుడు తన సోదరి కల్రా ముండా గత జనవరిలో అనారోగ్యంతో మరణించిన తర్వాత, ఆమె పేరున Odisha Grameen Bankలో ఉన్న సుమారు ₹20,000 నగదు తీసుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే, బ్యాంకు అధికారులు సరైన పత్రాలు లేకుండా డబ్బు ఇవ్వలేమని తెలిపారు. డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారు. కానీ ఈ ప్రక్రియల గురించి అవగాహన లేని జితు ముండా, ఏప్రిల్ 27న తన సోదరి పాతిపెట్టిన శవాన్ని త్రవ్వి బయటకు తీసి బ్యాంకుకు తీసుకెళ్లాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ విధానాలు, బ్యాంకుల వ్యవహార శైలి పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
శవాన్ని అనుమతి లేకుండా బయటకు తీసినందుకు జితు ముండా పై కేసు నమోదు చేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ, పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో కేసు నమోదు చేయకుండా నిలిపివేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి జితుకు డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అందించేలా చర్యలు తీసుకున్నారు.
