క్రీడల్లో పాల్గొనడమే నిజమైన విజయం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిరియాల, జనవరి 29:
క్రికెట్ అనేది భారత్‌లో గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అపార ప్రజాదరణ పొందిన క్రీడ అని, ప్రతి ప్రాంతంలోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి అన్నారు. క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, పాల్గొనడమే నిజమైన విజయం అని పేర్కొన్నారు.
క్రీడల ద్వారా టీమ్ వర్క్, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని మంత్రి వివరించారు. తన తండ్రి కాకా వెంకటస్వామి గారి స్మారకార్థంగా రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో స్పాన్సర్‌షిప్ ద్వారా క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు కృషి చేసినట్లు తెలిపారు.
బుధవారం చెన్నూరు జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో పురాణం రామకృష్ణయ్య స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన కోటపల్లి జట్టుకు మొదటి బహుమతిని, రన్నరప్‌గా నిలిచిన గొర్లపల్లి జట్టుకు రెండవ బహుమతిని ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ అద్భుతమైన క్రికెట్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను అభినందించారు. కోటపల్లి ప్రాంతం నుంచి ఇప్పటికే అండర్–19 క్రికెట్‌లో ఇద్దరు క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమని అన్నారు.
కోటపల్లి ప్రాంతంలో ఆధునిక క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన ఫారెస్ట్ క్లియరెన్స్ అంశంపై సంబంధిత ఫారెస్ట్, రెవెన్యూ అధికారులతో చర్చించి అనుమతులు సాధించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, స్థానిక నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.
