సి.ఎస్. సోమేశ్ కుమార్ తో వీఆర్ఏ ల సమావేశం
హైదరాబాద్: గత కొద్ది కాలంగా సమ్మె చేస్తున్న గ్రామ రెవిన్యూ సహాయకులు తమ డిమాండ్ల సాధనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో నేడు బీఆర్ కేఆర్ భవన్ లో సమావేశమయ్యారు. సీసీఎల్ ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ సమక్షంలో జరిగిన ఈ చర్చలలో వీఆర్ఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, వీఆర్ఏ ల డిమాండ్లపై ప్రభుత్వం సానుభూతితో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తి వేయగానే వారి విజ్ఞాపణలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు.
ఈ సందర్బంగా వీఆర్ఏ లు పలు విజ్ఞాపనలను సి.ఎస్ కు విన్నవించారు. పే స్కేల్ వర్తింపు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం ఇప్పించడం, కేసులు ఎత్తివేయడం, సమ్మె కాలాన్నిప్రత్యేక సెలవుదినంగా ప్రకటించడం. సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏ ల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను తెలిపారు. ఈ సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జెనరల్ దాదే మియా, కన్వీనర్ డీ. సాయన్న, కో కన్వీనర్ వంగూరు రాములు, వై. వెంకటేష్ యాదవ్, మొహమ్మద్ రఫీ, ఎం. గోవింద్, కె. శిరీష రెడ్డి, వై. సునీత, మాధవ్ నాయుడు, ఎల్. నర్సింహా రావు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.